ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ (94 నాటౌట్ 51 బంతుల్లో) తన విధ్వంసర బ్యాటింగ్‌తో చివరి వరకు క్రీజ్‌లో నిలబడి గుజరాత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. చెన్నై నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఏడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో మిల్లర్‌తో పాటు కెప్టెన్ రషీద్ ఖాన్ (40) వీరోచిత బ్యాటింగ్ చేశాడు. దీంతో గుజరాత్ (10) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ టీం ఈ సీజన్లో ఐదో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు పడగొట్టాడు. మహీశ్ తీక్షణ రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేడా, ముకేశ్ చౌదరి చెరో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ నెగ్గిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 170 పరుగుల టార్గెట్ ఉంది.
చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగిఆడాడు. 48 బంతుల్లో 73 పరుగులు చేసి తన ఖాతాలో హాఫ్ సెంచరీ వేసుకున్నాడు. రుతురాజ్ స్కోర్‌లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. రుతురాజ్‌తో పాటు అంబటి రాయుడు కూడా వేగంగా పరుగులు రాబట్టాడు. 31 బంతుల్లో 46 పరుగులతో మెరిశాడు. కానీ హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. కెప్టెన్ జడేజా (22), శివమ్ దూబే (19 నాటౌట్) రాణించగా.. రాబిన్ ఉతప్ప (3), మొయిన్ అలీ (1) నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో జోసెఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, షమీ చెరో వికెట్ తీశారు.