Pratika Rawal : వరల్డ్ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజయంపై కన్నేసిన భారత జట్టుకు భారీ షాక్. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో మైదానం వీడింది. ఫీల్డింగ్ చేస్తూ.. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో తను గాయపడింది. ఎడమ కాలిమడిమ మడతపడంతో నొప్పిని భరించలేకపోయింది ప్రతీక. నడవడానికి ఇబ్బంది పడిన ఆమెను సహచరులు డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. అయితే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసినా బ్యాటింగ్‌కు రాలేదు. దాంతో.. స్మృతిమంధానతో కలిసి అమన్‌జోత్ కౌర్ ఇన్నింగ్స్ ఆరంభించింది.
వర్షం అంతరాయంతో 27 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో కీలక వికెట్లు పడినా శోభన మోస్త్రే (26) కీలక ఇన్నింగ్స్ ఆడింది. రాధా యాదవ్ వేసిన 21వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన శోభన.. చివరి బంతిని మిడాఫ్‌లో బలంగా కొట్టింది. బౌండరీ వెళ్లకుండా బంతిని ఆపబోయిన ప్రతీక.. కొంచెం ముందుకు వెళ్లింది. తిరిగి వెనక్కి వచ్చే క్రమంలోషూ స్పైక్స్ గడ్డిలో ఇరుక్కోవడంతో.. ఆమె ఎడమ కాలిపాదం మడత పడింది.
🚨 UPDATE#TeamIndia all-rounder Pratika Rawal sustained an injury to her knee and ankle while fielding in the 1st innings against Bangladesh. The BCCI Medical Team is closely monitoring her progress.#WomenInBlue | #CWC25 | #INDvBAN pic.twitter.com/JDocwJEF9A
— BCCI Women (@BCCIWomen) October 26, 2025
దాంతో.. నొప్పిని భరించలేకపోయిన ప్రతీకాను ఫిజియో వచ్చి పరిశీలించింది. అయినా ఉపశమనంగా లేకపోవడంతో తను కుంటుతూ నడుస్తూనే సహచరుల సాయంతో మైదానం వీడింది. గురువారం టేబుల్ టాపర్ ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ఉన్నందున ప్రతీక గాయం పెద్దది కావొద్దని భారత జట్టు కోరుకుంటోంది. అయితే.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె ఆరోగ్యంపై మ్యాచ్ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ లేదా.. కోచ్ మజుందార్ ప్రకటన చేసే అవకాశముంది.