Shreyas Iyer : భారత జట్టుకు బిగ్ షాక్. సిడ్నీ మైదానంలో జరిగిన మూడో వన్డేలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కొన్నిరోజులు ఆటకు దూరం కానున్నాడు. శనివారం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ జరుగుతుండగానే వైద్యులు అయ్యర్‌కు స్కానింగ్ పరీక్షలు జరిపారు. అందులో.. అతడు పక్కటెముకలకు గాయం అయినట్టు గుర్తించారు. కోలుకునేందుకు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దాంతో.. వైస్ కెప్టెన్ మరోసారి జట్టుకు దూరం అవుతాడని బీసీసీఐ వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుబోయే వన్డే సిరీస్‌కు అయ్యర్ అందుబాటులో ఉండడంపై సందేహాలు నెలకొన్నాయి.
మూడో వన్డేలో హర్షిత్ రానా ఓవర్లో అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని అయ్యర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. సూపర్ క్యాచ్ పట్టిన అతడు.. ఆ తర్వాత నొప్పితో విలవిలలాడాడు. దాంతో, ఫీజియో వచ్చి పరీక్షించాడు.. అయినా ఉపశమనంగా లేకపోవడంతో అయ్యర్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.
UPDATE – Shreyas Iyer sustained an injury to his left rib cage while fielding. He has been taken to the hospital for further evaluation and assessment of his injury.#AUSvIND pic.twitter.com/UFffBiGxsF
— BCCI (@BCCI) October 25, 2025
‘శ్రేయస్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ పరీక్షలు చేయించాం. మొదటి డయాగ్నసిస్‌లో.. అతడి ఎడమ పక్కటెముకలో ఇబ్బంది ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అందుకే.. అయ్యర్‌కు మూడు వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత అతడు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరుతాడు. తదుపరి వైద్య పరీక్షలు, రిపోర్టులు వచ్చాక అయ్యర్ ఎన్ని రోజుల్లో కోలుకుంటాడు? అనేది తెలుస్తుంది. ఒకవేళ చిన్నపాటి పగుళ్లు అయితే.. ఎక్కువ సమయం పట్టనుంది’ అని బీసీసీఐ పోస్ట్‌లో పేర్కొంది.