క్రీడా యవనికపై హైదరాబాద్ మరోమారు తళుక్కుమంది. ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన రాజధాని తాజాగా ఫార్ములా రేసింగ్‌ను పరిచయం చేసింది. రయ్య్‌మ్రంటూ రాకెట్ వేగంతో దూసుకెళ్లే కార్లు నగర నడిబొడ్డున కేక పుట్టించాయి. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతంలో ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఆరు ఫ్రాంఛైజీల కలయికతో హైదరాబాద్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి రేసర్లు కొత్త ట్రాక్‌పై దుమ్మురేపారు. వాయు వేగంతో దూసుకెళ్తూ అభిమానులకు ఫార్ములా రేసింగ్ మజాను అందించారు. లీగ్ తొలి రోజు ప్రాక్టీస్ జరుగగా, ఆదివారం అసలు సిసలైన పోరుతో మరింత జోష్ రానుంది.
హైదరాబాద్ కొత్త హంగులు అద్దుకుంది. నగరం నడిబొడ్డున ఫార్ములా రేసింగ్ అభిమానులను కట్టిపడేసింది. భాగ్యనగర యువతకు రేసింగ్ మజాను పరిచయం చేసింది. ఇండియన్ రేసింగ్ లీగ్ అరంగేట్రం సీజన్‌కు శనివారం అట్టహాసంగా తెరలేచింది. స్ట్రీట్ సర్క్యూట్లో భాగంగా హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో కార్లు రయ్య్‌మ్రంటూ దూసుకెళ్లాయి. మంత్రి కేటీఆర్ జెండా ఊపి రేస్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆరు జట్ల సమాహారంతో జాతీయ, అంతర్జాతీయ రేసర్ల ప్రాతినిధ్యంతో మొదలైన రేసింగ్ లీగ్ షో వాహ్ వా అనిపించింది. ట్రాక్‌పై రేసర్లు టాప్‌గేర్‌లో దూసుకెళ్తుంటే అభిమానులు ఈలలు, కేరింతలతో సందడి చేశారు. కొత్తగా నిర్మించిన ట్రాక్‌పై ఆరు జట్ల రేసర్లు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డారు. పోటీల తొలి రోజు రేసర్లు ప్రాక్టీస్‌కు పరిమితం కాగా, నేడు అసలు, సిసలైన పోరు జరుగనుంది.
నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్ కీర్తి కీరిటంలో మరో కలికుతురాయి చేరింది. ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక క్రీడాటోర్నీలకు ఆతిథ్యమిచ్చిన భాగ్యనగరం ఖాతాలో మరో ఘనత చేరింది. దేశంలోనే తొలిసారి ఫ్రాంచైజీల కలయికతో రూపుదిద్దుకున్న ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) తొలి సీజన్‌కు శనివారం ఘనంగా తెరలేచింది. రేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ట్రాక్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్..ఐఆర్ఎల్ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 2.7కిలోమీటర్లు కొత్తగా నిర్మించిన ట్రాక్‌పై రేసర్లు తమ ప్రతిభను కనబరిచారు. ట్రాక్ అలవాటు పడేందుకు తొలి రోజు రేసర్లందరూ ప్రాక్టీస్‌కు పరిమితమయ్యారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం రెండు క్వాలిఫయింగ్ రేసులతో పాటు రేస్-1 జరుగాల్సింది. కానీ ట్రాక్‌పై పూర్తి అవగాహన కోసం నిర్వాహకులు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించారు. ఆదివారం క్వాలిఫయింగ్తో పాటు ప్రధాన రేసు జరుగుతుంది. దీనికి తోడు జేకే టైర్స్ స్పాన్సర్‌షిప్‌లో ఫార్ములా-4 కార్లు కూడా ట్రాక్‌పై దూసుకెళ్లాయి.
ఓవైపు ఇండియన్ రేసింగ్ లీగ్ ఫార్ములా-3 కార్లకు తోడు మీగతా కార్లు అభిమానులకు కొత్త అనుభూతి అందించాయి. ఇటలీకి చెందిన వోల్ఫ్ కంపెనీ రూపొందించిన కార్లు గరిష్టంగా గంటకు 250కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కల్గిఉన్నాయి. అయితే సర్క్యూట్లో ఉన్న 17 మలుపులను దృష్టిలో పెట్టుకుని రేసర్లు 140, 150 కిలోమీటర్ల వేగానికి పరిమితమయ్యారు. రేసు ముగిసిన తర్వాత నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో నిర్వహణ ఏర్పాట్లు ఆదివారం రేస్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
బ్లాక్‌బర్డ్స్ తరఫున అంతర్జాతీయ రేసర్ అనిందిత్‌రెడ్డి, అఖిల్ రవీంద్ర, నీల్జానీ, లోలా లోవిన్ఫోస్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హైదరాబాదీ అనిందిత్‌రెడ్డి తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ ట్రాక్‌పై కారును పరుగులు పెట్టించాడు. ప్రత్యర్థి రేసర్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగాడు. రేస్ ముగిసిన తర్వాత అనిందిత్ మీడియాతో మాట్లాడుతూ ‘ట్రాక్‌తో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రేసర్లకు ఈ ట్రాక్ కొత్తది. స్ట్రీట్ సర్క్యూట్లో పోటీపడటం చాలా మంది రేసర్లకు ఇది తొలిసారి. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత రేస్ అధికారులకు మా ఫీడ్‌బ్యాక్ అందజేస్తాం. భద్రతే మా తొలి ప్రాధాన్యం. ట్రాక్ కొత్తగా నిర్మించడం వలన బ్రేక్ వేసేటప్పుడు కొంత ఇబ్బంది కల్గుతుంది. ఈ రోజు ట్రాక్ ఒకింత మందకోడిగా ఉంది. ఆదివారానికి కొంత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి’ అని అన్నాడు.
రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అఖిలేశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘హైదరాబాద్ నగరం గర్వించే సందర్భం. దేశంలో తొలిసారి ప్రవేశపెట్టిన స్ట్రీట్ సర్క్యూట్‌కు ఆతిథ్యమివ్వడం ద్వారా హైదరాబాద్ మరోమారు అంతర్జాతీయ స్థాయిలో తళుక్కుమంది. ట్రాక్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ప్రభుత్వ సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు. దేశంలో మోటార్ స్పోర్ట్స్‌కు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రేక్షకులకు మరింత చేరువచేసేందుకు రేసులు నిర్వహిస్తున్నాం. రేసింగ్ ద్వారా ప్రతిభ కల్గిన రేసర్లను వెలుగులోకి తీసుకొస్తాం.