INDvsZIM: జింబాబ్వేతో హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20లో యువ భారత్ మరోసారి భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (27 బంతుల్లో 36, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ (10) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన తుది జట్టులో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్న జైస్వాల్, శాంసన్, దూబె జట్టుతో కలిశారు. పేస్ బౌలర్లలో ముకేశ్‌కు రెస్ట్ ఇచ్చిన టీమ్‌మేనేజ్‌మెంట్.. ఖలీల్ అహ్మద్‌ను ఫైనల్ లెవెన్‌కు తీసుకుంది. ధ్రువ్ జురెల్ స్థానంలో శాంసన్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలను అప్పగించింది. గిల్‌తో ఓపెనర్‌గా వచ్చిన జైస్వాల్ తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు, సిక్సర్‌తో తన ఉద్దేశాన్ని చాటాడు. రెండో ఓవర్లో గిల్ సైతం 4, 6, 4తో భారత్ స్కోరు రాకెట్ వేగాన్నితలపించింది. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో 8 ఓవర్లు ముగిసేసరికే భారత్ వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. తొమ్మిదో ఓవర్లో రజా వేసిన బంతిని స్వీప్ చేయబోయిన జైస్వాల్.. బెన్నెట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. కానీ రుతురాజ్ అండతో గిల్ రెచ్చిపోయాడు.
Innings Break!
Captain @ShubmanGill top-scores with 66(49) as #TeamIndia post 182/4 in the first innings 💪
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/6q46FzzkgP
— BCCI (@BCCI) July 10, 2024
మధ్వెరె వేసిన 13వ ఓవర్లో గిల్ ఓ సిక్సర్ బాదగా రుతురాజ్ 6,4 సాధించాడు. చటారా 14వ ఓవర్లో ఫోర్ కొట్టిన గిల్ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో గిల్.. ముజర్బని వేసిన 18వ ఓవర్లో రజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ ఆఖర్లో రుతురాజ్ వేగంగా ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింది. అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రుతురాజ్ ఔట్ అయి నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికందర్ రజా (2/24) మరోసారి రాణించగా బ్లెస్సింగ్ ముజర్బని (2/25) తప్ప మిగిలినవారంతా విఫలమయ్యారు. భారీ ఛేదనలో జింబాబ్వే ఏ మేరకు పోరాడుతుందనేది ఆసక్తికరం.