INDvsSA 1st Test: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సఫారీ బౌలర్ల ధాటికి ఆరంభంలో వికెట్లు కోల్పోయిన టీమిండియా.. తర్వాత కుదురుకున్నట్టే కనిపించినా లంచ్ తర్వాత ఓవర్లోనే కీలక వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (34 బ్యాటింగ్), శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 31, 3 ఫోర్లు, 1 సిక్స్) లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
దక్షిణాఫ్రికా సారథి టెంబా బవుమా టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయాన్ని బౌలర్లు సరైనదే అని ప్రూవ్ చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ (14 బంతుల్లో 5) ను రబాడా ఐదో ఓవర్లోనే ఔట్ చేసి సఫారీలకు తొలి బ్రేక్ ఇచ్చాడు. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (37 బంతుల్లో 17, 4 ఫోర్లు) తో పాటు వన్ డౌన్లో వచ్చిన శుభ్‌మన్ గిల్ (2)ను నండ్రె బర్గర్ వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. యశస్వితో పాటు గిల్ కూడా కీపర్ వెరియాన్నె కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించారు.
24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు భారత్‌ను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ సఫారీ పేస్ త్రయం రబాడా, జాన్సెన్, బర్గర్, కొయెట్జ్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. లంచ్ విరామ సమయానికి ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అయితే లంచ్ తర్వాత రబాడా వేసిన మొదటి ఓవర్లో (ఇన్నింగ్స్ 27వ ఓవర్) ఆఖరి బంతికి శ్రేయస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.30 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. కోహ్లీ (38 బ్యాటింగ్), కెఎల్ రాహుల్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయాలంటే ఈ ఇద్దరూ నిలవాలి. భారత్ ఆశలన్నీ ఈ ఇద్దరిమీదే ఉన్నాయి.