ముంబై : నిర్వహణ లోపాలతో దేశవ్యాప్తంగా ఇండిగో విమానయాన సేవల్లో తలెత్తిన తీవ్ర అంతరాయం.. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ముంబై ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) కొంపముంచింది. విమానయాన సేవలు వాయిదాపడటంతో ముంబై నుంచి గోవా వెళ్లేందుకు ఆ జట్టు సభ్యులు సుమారు 12 గంటలకు పైగా ముంబై విమానాశ్రయంలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబై నుంచి గోవాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం.. 12 గంటల నిరీక్షణ తర్వాత రాత్రి ఒంటి గంట దాటాక పయనమైంది.
ఆ జట్టు గోవా చేరుకుని హోటల్‌కు వెళ్లేసరికి తెల్లవారుజామున 4 గంటలైంది. దీంతో ముంబై ఎఫ్‌సీ ఆటగాళ్లు తీవ్ర అలసటకు గురయ్యారు. ఫలితంగా గురువారం ఆ జట్టు.. గోవాతో జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో 1-2తో ఓటమి చవిచూసింది. ఓటమి అనంతరం జట్టు సభ్యులతో పాటు హెడ్‌కోచ్ పెట్ క్రాట్కీ కూడా ఇండిగో సేవలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.