హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత యువ షూటర్ ఇషాసింగ్ మరోమారు తళుక్కుమంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు కొల్లగొట్టిన ఇషా మరోమారు సత్తాచాటింది. భోపాల్ వేదికగా జరుగుతున్న 65వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 10మీటర్ల పిస్టల్ ఈవెంట్ పసిడి పోరులో ఇషా 13-17తో ఒలింపియన్ మనుభాకర్ చేతిలో పోరాడి ఓడింది. రిథమ్‌కు కాంస్య పతకం దక్కింది.
అర్హత రౌండ్లో మనుభాకర్ 583 పాయింట్లతో టాప్‌లో నిలువగా, 576 పాయింట్లతో ఇషా ఐదో స్థానంలో నిలిచింది. యూత్ విభాగం ఫైనల్లో ఈ తెలంగాణ యువ షూటర్ 16-12తో సంస్కృతిపై గెలిచి పసిడి కైవసం చేసుకుంది. మరోవైపు 10మీటర్ల పిస్టల్ ఈవెంట్లో దివ్యకు స్వర్ణం, సంస్కృతి, రిథమ్ సాంగ్వాన్‌కు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి.