టొరంటో: ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ రేసుకు భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అత్యంత సమీపానికి వచ్చాడు. కీలకమైన 13వ రౌండ్లో గుకేశ్.. ఫ్రాన్స్‌కు చెందిన పిరౌజా అలీరెజాను ఓడించి 8.5 పాయింట్లతో టోర్నీలో సోలోగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 47 ఎత్తుల్లో ప్రత్యర్థిని చిత్తు చేసిన గుకేశ్.. చివరి రౌండ్లో హికారు నకమురాతో తలపడనున్నాడు. 8 పాయింట్లతో ఇయాన్ నెపొనియాచి, నకామురాలు సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
ఈ ఇద్దరి మధ్య 13వ రౌండ్ జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడం, నకామురాపై విజయంతో గుకేశ్ మొదటి స్థానానికి ఎగబాకాడు. ఈ గెలుపుతో 17 ఏండ్ల భారత కుర్రాడు.. చివరి రౌండ్ మ్యాచ్‌లో గెలిచినా, డ్రా చేసుకున్నా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌తో పోటీ పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే టైటిల్ రేసు నుంచి తప్పుకున్న ప్రజ్ఞానంద.. ఫాబియానో చేతిలో ఓడగా నిజత్ అబసోవ్‌తో గేమ్‌ను విదిత్ డ్రా చేసుకున్నాడు. మహిళల కేటగిరీలో భాగంగా అన్నా ముజిచుక్‌తో గేమ్‌ను కోనేరు హంపి డ్రా చేసుకోగా వైశాలి.. టింగ్జి లి (చైనా)ను ఓడించింది.