ఎడ్జ్‌బాస్టన్: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా.. రాయల్ లండన్ వన్డే కప్‌లో టీ20 తరహా ఆటతో అదరగొట్టాడు. భారీ షాట్లతో చెలరేగిన పుజారా ఒకే ఓవర్లో 22 పరుగులు రాబట్టడంతో పాటు.. 79 బంతుల్లోనే 107 పరుగులు సాధించడం గమనార్హం. ఇందులో ఏడు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
సుదీర్ఘ ఫార్మాట్లో ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ.. ఓవర్లకు ఓవర్లు కరిగించే పుజారా.. ఈ మ్యాచ్‌లో తన సహజ శైలికి విరుద్ధంగా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పుజారా శతకంతో మెరిసినా.. ససెక్స్ జట్టు ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం ససెక్స్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులకు పరిమితమైంది.