ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత చరిత్ర తిరగరాస్తూ.. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. మరో సంచలనం నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఏ భారత అథ్లెట్‌కు సాధ్యం కాని ప్రపంచ చాంపియన్ హోదాను నీరజ్ అలవోకగా అందుకున్నాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో ఒకే ఒక్క త్రోతో తుదిపోరుకు అర్హత సాధించిన నీరజ్.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాడు. రెండో ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.
Neeraj Chopra | బుడాపెస్ట్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతున్న మెగాటోర్నీలో ఆదివారం నీరజ్ బరిసెను 88.17 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. నిరుడు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో రజతం నెగ్గిన నీరజ్ ఈసారి పసిడి ముద్దాడాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో మొదటి ప్రయత్నంలోనే బరిసెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరడంతో పాటు వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నీరజ్.. తుదిపోరులోనూ దుమ్మురేపాడు.
ఆదివారం భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన నీరజ్ తొలి ప్రయత్నంలో ఫౌల్ చేయగా.. రెండో ప్రయత్నంలో బరిసెను 88.17 మీటర్ల దూరం విసిరి టాప్కు దూసుకెళ్లాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ రజతం, వాడ్లెచ్ కాంస్యం దక్కించుకున్నారు. మూడో ప్రయత్నంలో నీరజ్ 86.32 మీటర్ల దూరం నమోదు చేసుకోగా.. అర్షద్ మూడో ప్రయత్నంలో బరిసెను 87.82 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. మరో భారత త్రోయర్ డీపీ మను మూడో ప్రయత్నంలో 83.72 మీటర్ల దూరం నమోదు చేసుకున్నాడు. కిషోర్ జెనా రెండో ప్రయత్నంలో బరిసెను 82.82 మీటర్ల దూరం విసిరాడు. రెండో ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నీరజ్ నాలుగోసారి 84.64, ఐదోసారి 87.73 మీటర్లకు పరిమితమయ్యాడు. రెండో రౌండ్ నుంచి టాప్‌లో నిలిచిన నీరజ్‌ను చివరి వరకు మరే త్రోయర్ అధిగమించలేకపోయాడు. దీంతో భారత అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నయా శకానికి నీరజ్ నాంది పలికాడు.