గ్లాస్గో: పదకొండు రోజుల పాటు క్రీడాభిమా నులను అలరించిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ హంగామా ముగిసింది. బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, అథ్లెటిక్స్, జూడోలో పతకాల పంట పండించడంతో గత రెండు దశాబ్దాలుగా ఈ గేమ్స్‌లో టాప్-5లో నిలుస్తూ వస్తున్న భారత్ ఈసారి కూడా తన లక్ష్యాన్ని నిలబెట్టుకొని గ్లాస్గోకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ.. తర్వాతి ఎడిషన్ క్రీడల ఆతిథ్య బాధ్యతలను సగర్వంగా అందుకుంది. 2030లో జరిగే కామన్వెల్త్ శతాబ్ది (వందేండ్ల) క్రీడలకు అమ్దావాద్ (అహ్మదాబాద్) నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఒవో హైడ్రో స్టేడియంలో భారత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడుతూ ఆదివారం అర్ధరాత్రి అట్టహాసంగా జరిగిన ముగింపు వేడుకల్లో కామన్వెల్త్ బ్యాటన్‌ను అధికారికంగా భారత్‌కు అందజేశారు. కింగ్ చార్లెస్-3 తరఫున ప్రాతినిధ్యం వహించిన ఎడిన్బర్గ్ ప్రిన్స్ ఎడ్వర్డ్స్ గ్లాస్గో గేమ్స్ అధికారికంగా ముగిసినట్టు ప్రకటించారు. నాలుగేండ్ల తర్వాత అహ్మదాబాద్‌లో జరిగే 24వ ఎడిషన్ గేమ్స్‌కు రావాలని ఆయా దేశాలు, అథ్లెట్లకు పిలుపునిచ్చారు. మహిళల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన జైస్మిన్ లంబోరియా ముగింపు వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని భారత బృందాన్ని ముందుండి నడిపించింది. అనంతరం కామన్వెల్త్ గేమ్స్ జెండాను అప్పగించే కార్యక్రమం మొదలైంది. స్కాట్లాండ్, భారత జాతీయ పతాకాలు ముందుండి నడిపించగా.. ఆ జెండా స్టేడియం మొత్తం చుట్టొచ్చింది. ఆపై, గ్లాస్గో లార్డ్ ప్రావోస్ట్ జాక్వెలిన్ మెక్ లారెన్ నుంచి కామన్వెల్త్ జెండాను స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష చివరగా గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి స్వీకరించారు. దాంతో గేమ్స్ ఆతిథ్య బాధ్యతలను స్కాట్లాండ్ నుంచి భారత్‌కు అధికారికంగా అప్పగించే ఘట్టం ముగిసినైట్టెంది.
వేడుకల్లో భారతీయం
ఫ్లాగ్ హ్యాండోవర్ తర్వాత భారత్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూడు అంచెల్లో నిర్వహించిన వేడుకల్లో తొలుత ‘వసుధైక కుటుంబకం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) ఇతివృత్తంతో తీర్చిదిద్దిన ఈ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ నేతృత్వంలో ‘వందేమాతరం’ 150 ఏండ్ల ఘట్టాన్ని ప్రతిబింబించేలా చేసిన నృత్య రూపకం, ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ అందించిన స్వరాలు మంత్రముగ్ధులను చేశాయి. తర్వాత అహ్మదాబాద్ నగరం, గుజరాత్ సంస్కృతి, భారత్‌లో క్రీడల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేక డిజిటల్ వీడియోను ప్రదర్శించారు. ప్రాచీన సంప్రదాయాలు, ఆధునికత కలబోతగా 2030 క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు అహ్మదాబాద్ సంసిద్ధతను అందులో చూపించారు.

తర్వాత ఆతిథ్య స్కాట్లాండ్, కాబోయే ఆతిథ్య దేశం భారత్ మధ్య అనుసంధానకర్తగా ఉన్న సంగీత ప్రాధాన్యతను చాటారు. ‘ది కల్చరల్ జుగల్బందీ’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో భారత సితార్ విద్వాంసుడు రిషభ్ శర్మ, స్కాటిష్ సంగీతకారుడు రాస్ ఐన్స్లీ కాంబినేషన్ మైమరపించింది. రిషభ్ సితార్ నాదం, రాస్ స్కాటిష్ పైప్స్ శబ్దాల సమ్మేళనం రెండు ప్రాచీన సంగీత సంప్రదాయాల మధ్య ఆత్మీయ సంభాషణలా సాగింది. చివర్లో శంకర్ మహదేవన్ తన కుమారులు సిద్ధార్థ్, శివమ్‌తో కలిసి వేదికపై సందడి చేశారు. ‘సునో గౌర్ సే దునియా వాలోం‘, ‘భాగ్ మిల్కా భాగ్’, ‘లెహరా దో’ వంటి దేశభక్తి గీతాలతో స్టేడియాన్ని హోరెత్తించారు. గుజరాత్ సింగర్ భూమి త్రివేది తన గొంతుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి నాలుగేండ్లలో కామన్వెల్త్ క్రీడలకు స్వాగతం పలికే తమ రాష్ట్ర వైభవాన్ని చాటింది.