మకావు: చైనాలో జరుగుతున్న మకావు ఓపెన్ సూపర్ 300 టోర్నీలో భారత పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. టైటిల్ ఆశలు మోసిన హైదరాబాదీ తరుణ్ మన్నేపల్లితో పాటు భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. టోర్నీలో తనకంటే మెరుగైన ర్యాంకు కల్గిన ఆటగాళ్లను మట్టికరిపించి తన కెరీర్లో తొలిసారి సూపర్ 300 టోర్నీలో సెమీస్ చేరిన తరుణ్.. కీలక పోరులో 21-19, 16-21, 16-21తో జస్టిన్ హో (మలేషియా) చేతిలో ఓడిపోయాడు. గంటా 21 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన పోరులో తొలి గేమ్ గెలుచుకున్నా తర్వాత వరుసగా రెండు గేమ్స్‌లో తడబడ్డ తరుణ్.. ఓటమి వైపు నిలవక తప్పలేదు. మరో సింగిల్స్ సెమీస్‌లో లక్ష్యసేన్.. 16-21, 9-21తో ఇండోనేషియా షట్లర్ అల్వి ఫర్హన్ జోరు ముందు తేలిపోయాడు.