గ్జియామెన్ (చైనా): ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సుదిర్మన్ కప్ ఫైనల్స్‌లో భారత్ పోరాటం గ్రూప్ దశలోనే ముగిసింది. ఈ టోర్నీలో క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్.. 1-4తో ఇండోనేషియా చేతిలో ఓటమిపాలైంది. గ్రూప్-డీలో భాగంగా డెన్మార్క్‌తో మంగళవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓడిన భారత షట్లర్లు.. ఇండోనేషియాతోనూ అదే వైఫల్యాలను కొనసాగించారు. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో ద్వయం 10-21, 21-18, 21-19తో రెహాన్-గ్లొరియాతో జరిగిన హోరాహోరీ పోరులో గెలిచి భారత్‌కు 1-0 ఆధిక్యం ఇచ్చారు.
కానీ తర్వాత జరిగిన 4 గేమ్‌లలో భారత షట్లర్లు ఒక్క మ్యాచ్ కూడా గెలుచుకోలేదు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 12-21, 13-21తో వర్దాని చేతిలో ఓడగా పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్.. 21-19, 14-21, 12-21తో జొనాథన్ క్రిస్టీ జోరుకు తలవంచాడు. మహిళల డబుల్స్‌లో ప్రియా-మిశ్రా జంట 10-21, 9-21తో మయసరి-రమధంతి చేతిలో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్‌లో హరిహరన్-రుబాన్.. 20-22, 18-21తో ఫిక్రీ-మార్టిన్ ద్వయం జోరు ముందు నిలువలేకపోయింది.