Team India | స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అవమానకర పరాభవం, పదేండ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)ని ఆస్ట్రేలియాకు అప్పగించిన భారత (టెస్టు) జట్టు ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా బలహీనంగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రెండు సిరీస్‌లలో ఓటములకు ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమే అని చెబుతున్నప్పటికీ బుమ్రాను మినహాయిస్తే ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన.. కనీసం భయపెట్టిన (?) భారత బౌలర్ లేడనేది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ముఖ్యంగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇది కొట్టొచ్చినట్టు కనిపించింది. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఉండుంటే ఫలితం ఎలా ఉండేదో కానీ అతడు లేకుంటే మన బౌలింగ్ పరిస్థితి దయనీయమనేది సుస్పష్టం.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : భారత జట్టుకు బౌలర్ల కొరత కొత్తేం కాదు. నాటి కపిల్ దేవ్ కాలం నుంచి నేటి బుమ్రా దాకా ఎవరో ఒకరిమీదే ఆధారపడటం.. ఆ బౌలర్ కాస్తా గాయాల బారిన పడితేనో, ఫామ్ కోల్పోతేనో మిగిలిన బౌలర్లు చేతులెత్తేసి సిరీస్‌లు, ఐసీసీ టోర్నీలు జారవిడుచుకున్న దాఖలాలు కోకొల్లలు! బ్యాటింగ్‌లో ఎంతోమంది మెరికల్లాంటి ఆటగాళ్లు వెలుగులోకి వస్తూ దిగ్గజాలను మరిపిస్తున్నప్పటికీ బౌలింగ్‌లో మాత్రం ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గత దశాబ్ద కాలంలో బుమ్రా, షమీ వంటి బౌలర్ల పుణ్యమా అని ఆ వేధన కాస్త తగ్గినా వీరిలో ఎవరు లేకపోయినా ఫలితాలు జట్టుకు అనుకూలంగా రావడం లేదు. గత రెండు సిరీస్‌లే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మరి బుమ్రా, షమీ స్థాయిని అందుకునే బౌలర్లను భారత్ తయారుచేస్తోందా? మన బౌలింగ్ బెంచ్ బలమెంత? దేశవాళీలో నిఖార్సైన పేసర్లు ఎంతమంది ఉన్నారు?
ఆసీస్‌తో బుమ్రా ఒక్కడే ఐదు మ్యాచ్‌లలో 32 వికెట్లు తీస్తే.. సిరాజ్, ప్రసిధ్, ఆకాశ్, హర్షిత్ కలిసి తీసింది 35 వికెట్లు. జట్టుకు అవసరమున్న ప్రతిసారీ బుమ్రా వికెట్లు పడగొట్టి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. అయితే మరో ఎండ్‌లో అతడికి సహకారం అందించే బౌలర్లే కరువయ్యారు. సిరీస్‌లో భారత్‌ను బాగా దెబ్బతీసిందిదే. గత రెండు సిరీస్‌లలో బుమ్రాకు అండగా షమీ కంగారూలను బెంబేలెత్తించాడు. నాలుగేండ్ల క్రితం టెస్టు జట్టులోకి వచ్చి ఇప్పటిదాకా 36 మ్యాచ్‌లాడిన సిరాజ్.. ఇప్పటికీ గేమ్ ఛేంజర్ కాలేకపోతున్నాడు. బుమ్రా లేకుంటే అతడి మీద ఆధారపడొచ్చన్న నమ్మకాన్ని జట్టుకు ఇవ్వలేకపోతున్నాడు.
విదేశాలలో పేస్ పిచ్‌లను మినహాయిస్తే భారత్‌లో అతడి ప్రదర్శన అంతంతమాత్రమే. సిడ్నీ టెస్టులో ఆడిన ప్రసిధ్.. తరుచూ గాయాల బారిన పడుతూ జట్టులోకి వస్తూ పోతున్నా ఇప్పటికీ అతడు నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఆకాశ్, ముకేశ్, హర్షిత్ వంటి బౌలర్లకు అంతర్జాతీయ అనుభవం తక్కువ. ‘సేన’ దేశాలుగా చెప్పుకునే సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వీరిని పరీక్షించలేదు. ఈ బౌలర్లను సానబెడితే గానీ ఫలితాలు ఎలా ఉంటాయనేది చెప్పలేం!
చాలాకాలంగా భారత్‌ను వేధిస్తున్న మరో సమస్య నిఖార్సైన ఎడమ చేతి వాటం పేసర్ లేకపోవడం. అర్ష్‌దీప్ సింగ్ రూపంలో టీ20లలో ఆ కొరత కాస్త తీరినప్పటికీ అతడు ఇంకా వన్డే, టెస్టులలో నిరూపించుకోలేదు. టెస్టులలో అరంగేట్రమే చేయలేదు. యశ్ దయాల్ రూపంలో ఓ ఆప్షన్ ఉన్నప్పటికీ దేశవాళీలో అతడి ప్రదర్శన అద్భుతం అనిపించేంతగానైతే లేదు.
ఇప్పటికే జట్టులో చోటు దక్కించుకున్నవారితో పాటు దేశవాళీలోనూ బుమ్రాను మరిపించేంత పేసర్ కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అదరగొట్టి బంతిని విసరడంలో కొత్త రికార్డులు నెలకొల్పిన మయాంక్ యాదవ్ ఆశలు కల్పిస్తున్నాడు. కానీ అతడు ఏ మేరకు ఫిట్నెస్ను కాపాడుకుంటాడనేది కాలమే నిర్ణయించాలి. అవేశ్ ఖాన్, ముఖేష్ చౌదరి, మోహ్సిన్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ బౌలర్లను సానబెట్టి వారికి తరుచుగా అవకాశాలు ఇవ్వాలి. ఎవరో ఒకరి మీద ఆధారపడకుండా బెంచ్‌ను పటిష్టంగా తయారుచేసుకుంటే విదేశీ పిచ్‌లపై ప్రధాన బౌలర్లు లేనప్పటికీ సిరీస్‌లు గెలవడం పెద్ద కష్టమేం కాదు.
పేస్‌తో పాటు భారత్ బౌలింగ్‌కు ప్రధాన ఆయుధమైన స్పిన్ విభాగంలోనూ లోటు కనిపిస్తోంది. అశ్విన్ రిటైర్మెంట్తో ఆ స్థాయిలో ప్రత్యర్థులను తిప్పలు పెట్టే స్పిన్నర్ భారత్‌కు కరువయ్యాడు. రవీంద్ర జడేజా సైతం కెరీర్ చరమాంకంలోనే ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ ఆల్‌రౌండర్లు కనిపిస్తుండటం సానుకూలాంశం అయినప్పటికీ దేశవాళీల్లో రాణిస్తున్న తనుష్ కొటియాన్ వంటి స్పిన్నర్లను తీర్చిదిద్దడం ఆవశ్యకం.