బ్రస్సెల్స్: ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లెకు నిరాశే ఎదురైంది. శుక్రవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టిపుల్చేజ్లో సాబ్లె తొమ్మిదో స్థానం లో నిలిచాడు. శుక్రవారం 30వ పడిలోకి ప్రవేశించిన సాబ్లె తన రేసును 8:17: 09 సెకన్ల టైమింగ్‌తో పేలవ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 10 మంది రేసర్లు పోటీపడ్డ రేసులో కెన్యాకు చెందిన అమోస్ సెరెమ్ (8:06:90సె), సోఫైన్ ఎల్ బకాలీ (8: 08:60సె), అమిన్ జినాహ్ (8:09:68సె) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లోనూ సాబ్లె స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమై 11వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
అర్జున్ అదుర్స్
బుడాపెస్ట్: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ అదరగొడుతున్నాడు. నాల్గో రౌండ్లో భాగంగా సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో అర్జున్ కీలకమయ్యాడు. అలెక్సీ సరనాతో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేసుకోగా, తనపై పెట్టుకున్న ఆశలను వమ్ముచేయని అర్జున్..ఇండిచ్ అలెగ్జాండర్‌ను ఓడించి వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు విదిత్ గుజరాతి, గుకేశ్ విజయాలతో భారత్ 3.5-0.5 తేడాతో సెర్బియాపై గెలిచింది.