ఆసియాకప్ లీగ్ దశలో దుమ్మురేపిన టీమ్ఇండియా..సూపర్-4 తొలి పోరులో పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలై ప్రమాదం అంచున నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. టైటిల్ పోరుకు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక నెగ్గాల్సిన స్థితిలో నేడు శ్రీలంకతో రోహిత్ సేన తలపడనుంది.ఫైనల్ చేరాలంటే గెలుపు తప్పనిసరి
దుబాయ్: ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో మంగళవారం శ్రీలంకతో భారత్ తలపడనుంది. సూపర్-4లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రౌండ్‌రాబిన్ లీగ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మిగిలిన రెండు మ్యాచ్‌లు నెగ్గితేనే రోహిత్ సేన తుదిపోరుకు అర్హత సాధించనుంది. ఈ క్రమంలో లంకతో పోరులో తిరిగి సత్తాచాటాలని టీమ్ఇండియా తహతహలాడుతున్నది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి లయ అందుకోవడం.. భారత్‌కు అతిపెద్ద సానుకూలత కాగా.. మిడిలార్డర్లో రిషబ్ పంత్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా నిలకడ కనబర్చాల్సిన అవసరం ఉంది. గాయం కారణంగా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరమవడంతో.. జట్టు కూర్పులో సమస్యలు నెలకొనగా.. బౌలింగ్‌లో సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడం మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు కల్పిస్తారా చూడాలి. మరోవైపు లీగ్దశలో బంగ్లాదేశ్‌పై విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న లంకేయులు భారత్‌కు గట్టి పోటీనివ్వాలని చూస్తున్నారు.
కోహ్లీపైనే భారం..
పొట్టి ఫార్మాట్లో గత కొన్నాళ్లుగా చెప్పుకోని ఇన్నింగ్స్ ఆడని రోహిత్ శర్మపై సహజంగానే ఒత్తిడి పెరిగింది. పాకిస్థాన్‌తో పోరులో అది బహిర్గతమైంది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కిన హిట్‌మ్యాన్.. తన పేరుకు తగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. ఇన్నాళ్లు కోహ్లీ ఫామ్ గురించే చర్చ సాగడంతో.. రోహిత్ విషయం వార్తల్లోకెక్కలేదు. తాజా టోర్నీలో విరాట్ రెండు హాఫ్‌సెంచరీలు నమోదు చేయడంతో.. ఇప్పుడు ఫోకస్ రోహిత్ మీదకు మళ్లింది. పాక్‌తో కీలక పోరులో సారథిగానూ రోహిత్ నిర్ణయాలు అభిమానులను విస్మయానికి గురిచేశాయి. ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకున్న దీపక్ హుడాతో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించని హిట్‌మ్యాన్.. అర్శ్‌దీప్ క్యాచ్ వదిలేసినప్పుడు మైదానంలోనే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ప్రయోగాలు పక్కనపెట్టి.. అత్యుత్తమ 11 మందితో బరిలోకి దిగితేనే మంచిదని మాజీలు సలహాలిస్తున్నారు. అవేశ్‌ఖాన్ తిరిగి జట్టులో చేరనుండగా.. చాహల్ నుంచి జట్టు మరింత ఆశిస్తున్నది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, కార్తీక్/పంత్, పాండ్యా, అక్షర్, భువనేశ్వర్, అవేశ్ ఖాన్, అర్శ్‌దీప్, చాహల్.
శ్రీలంక: షనక (కెప్టెన్), పతుమ్, కుషల్, చరిత, గుణతిలక, రాజపక్స, హసరంగ, చమిక, మహేశ్, ఫెర్నాండో, మధుషనక.