షాంఘై : చైనా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 టోర్నీలో భారత మహిళల, పురుషుల కాంపౌండ్ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఒజాస్ దియోతలె, అభిషేక్ వర్మ, రిషబ్ యాదవ్‌తో కూడిన భారత ఆర్చరీ త్రయం సెమీఫైనల్లో 232-231 తేడాతో డెన్మార్పై అద్భుత విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో మన జట్టు 239-232తో బ్రిటన్ను ఓడించింది.
మహిళల కాంపౌండ్ టీమ్ సెమీస్‌లో మధుర ధామన్గావోంకర్, చికిత తానిపర్తి, వెన్నెం జ్యోతిసురేఖ త్రయం 232-230తో బ్రిటన్‌పై గెలిచి ఫైనల్లో మెక్సికోతో పోరుకు సిద్ధమైంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ, రిషబ్ యాదవ్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. మహిళల కాంపౌండ్ కేటగిరీలో మధురకు మూడో స్థానం దక్కింది. అభిషేక్, మధురతో కూడిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ రెండో రౌండ్లోకి ప్రవేశించింది.