అస్తానా: ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ అమన్ షెరావత్ పసిడి పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల 57కిలోల విభాగం ఫైనల్లో బరిలోకి దిగిన అమన్ 9-4తో అల్మాజ్ స్మాన్బెకోవ్(కిర్గిస్థాన్)పై అద్భుత విజయం సాధించాడు. సీనియర్ సర్యూట్లో నిలకడగా రాణిస్తున్న అమన్ ఏషియన్ టోర్నీలో తనదైన దూకుడు కనబరిచాడు.
ఈ సీజన్లో ఈ యువ రెజ్లర్కు ఇది రెండో పతకం. ఫిబ్రవరిలో జరిగిన టోర్నీలో కాంస్యం సొంతం చేసుకున్నాడు. దీనికి తోడు గతేడాది అండర్-23 ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ను షెరావత్ దక్కించుకున్నాడు. మరోవైపు వేర్వేరు విభాగాల్లో దీపక్ కుక్నా(79కి), దీపక్ నెహ్రా(97కి) కాంస్య పతక పోరులో తలపడనున్నారు. మొత్తంగా టోర్నీలో భారత రెజ్లర్లు 12 పతకాలు ఖాతాలో వేసుకున్నారు.