లక్నో: ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్‌లో భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ అద్వితీయ ప్రదర్శన కనబర్చాడు. వరల్డ్ గ్రూప్-2లో భాగంగా శనివారం మొరాకోతో ప్రారంభమైన కీలక పోరులో నాగల్ భారత జట్టుకు కీలక విజయాన్నందించాడు. టైలో భాగంగా శనివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత్ ఒకటి గెలిచి మరొకటి ఓడి 1-1తో స్కోరు సమం చేసింది. తొలి పోరులో శశికుమార్ ముకుంద్ 7-6 (7/4), 5-7, 1-4తో యాసీన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
మూడు గంటలకు పైగా సాగిన పోరులో తీవ్రంగా శ్రమించిన ముకుంద్.. కీలక సమయాల్లో ప్రత్యర్థికి ఆధిక్యం కట్టబెట్టాడు. 4 ఏస్‌లు కొట్టిన శశికుమార్ 7 డబుల్ ఫాల్ట్స్ చేస్తే.. 12 ఏస్‌లు బాదిన యాసీన్ 17 గేమ్స్ గెలిచి సత్తాచాటాడు. తొలి పోరులోనే పరాజయం ఎదురవడంతో భారత జట్టు డీలా పడగా.. రెండో సింగిల్స్ మ్యాచ్‌లో నాగల్ 6-3, 6-3 ఆడమ్‌పై గెలుపొందాడు.
75 నిమిషాల పాటు సాగిన పోరులో నాగల్.. పూర్తి ఆధిపత్యం కనబర్చాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో విజృంభించాడు. 4 బ్రేక్ పాయింట్లు ఖాతాలో వేసుకున్న నాగల్.. 12 గేమ్స్ గెలుచుకున్నాడు. దీంతో భారత జట్టు పోటీలోకి వచ్చింది. ఆదివారం జరుగనున్న డబుల్స్ పోరులో రోహాన్ బోపన్న-యూకీ బాంబ్రీ జోడీ బరిలోకి దిగనుండగా.. మరోసారి నాగల్, ముకుంద్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండింట నెగ్గిన వారు టై హస్తగతం చేసుకోనున్నారు. టెన్నిస్‌లో ప్రపంచకప్ వంటి డేవిస్ కప్‌లో తాను ఆడటం ఇదే చివరిసారి అని రోహన్ బోపన్న ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.