హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో భారత యువ ద్వయం గంటా సాయికార్తీక్రెడ్డి, తీర్థ శశాంక్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల సెమీస్‌లో కార్తీక్‌రెడ్డి, శశాంక్ జోడీ 4-6, 6-3, 10-4 తేడాతో అమెరికా-ఉక్రెయిన్ ద్వయం ప్యాట్రిక్ ఎడ్వర్డ్, వాదిస్లోవ్ ఒర్లోవ్పై అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థికి తొలి సెట్ చేజార్చుకున్న కార్తీక్, శశాంక్ అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు సెట్లలో మ్యాచ్‌ను తమ వశం చేసుకుంది. ఈ మధ్యకాలంలో నిలకడగా రాణిస్తున్న కార్తీక్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.