అమ్స్టెల్వీన్: హాకీ ప్రనపంచకప్లో భారత మహిళల జట్టు ప్రస్థానం ముగిసింది. నెదర్లాండ్స్ చేతిలో పురుషుల జట్టు ఓటమి బాధ మరువక ముందే అమ్మాయిల పోరాటమూ రెండో దశలోనే ఆగిపోయింది. పూల్ ‘ఈ’లో భాగంగా ఆడిన మూడు మ్యాచుల్లో రెండు డ్రా చేసుకుని ఒకదాంట్లో ఓడిన సలీమ సేన.. ఆదివారం ఆస్ట్రేలియాతో గేమ్నూ డ్రాగానే ముగించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు చేరాలన్న 52 ఏండ్ల నిరీక్షణకు తెరదించాలని యత్నించిన భారత్‌కు మరోసారి నిరాశే ఎదురవగా ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించింది.
మ్యాచ్‌లో పలుమార్లు పెనాల్టీ కార్నర్లు లభించినా వాటిని గోల్స్‌గా మలచడంలో రెండు జట్లూ విఫలమయ్యాయి. ఇదిలాఉండగా ఇప్పటికే సెమీస్ ఆశలు గల్లంతైన వేళ భారత పురుషుల జట్టు నేడు అర్జెంటీనాతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీ సెమీస్ రేసులో నిలవాలంటే ఇతర సమీకరణాలకు తోడు హర్మన్‌ప్రీత్ సేన ఈ మ్యాచ్‌లో భారీ గోల్స్ తేడాతో విజయం సాధించాల్సి ఉంది.