హార్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక ఊబర్ కప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య డెన్మార్క్‌తో ఓడినా తమ రెండో మ్యాచ్‌లో 4-1తో ఉక్రెయిన్‌పై ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. గ్రూప్-ఏ పోరులో భాగంగా మహిళల సింగిల్స్‌లో యువ సంచలనాలు ఉన్నతి హుడా, తన్వి శర్మ, దేవికా సిహాగ్ సత్తాచాటి భారత్‌కు విజయాన్ని అందించారు. మొదట ఉన్నతి.. 21-19, 22-20తో పొలిన బహ్రోవాను చిత్తుచేసి భారత్‌కు శుభారంభాన్ని అందించింది. అదే ఊపులో తన్వి.. 21-12, 17-21, 21-10తో యెవెనిలను ఓడించింది. మూడో సింగిల్స్‌లో దేవికా.. 23-21, 21-13తో మరియా స్టొలిరెంకొపై అలవోకగా నెగ్గి ఆధిక్యాన్ని 3-0కు తీసుకెళ్లింది. డబుల్స్‌లో కవిప్రియ-సిమ్రన్ ద్వయం 11-21, 17-21తో బహ్రోవా-యెవెనిల చేతిలో ఓడింది. కానీ రెండో డబుల్స్‌లో తనీషా.. సీనియర్ షట్లర్ పీవీ సింధుతో కలిసి 21-18, 21-15తో సోఫియా, స్టొలిరెంకొను మట్టికరిపించింది.