మెల్బోర్న్: ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్‌కు తొలి రౌండ్లోనే కఠిన ప్రత్యర్థి ఎదురయ్యాడు. గురువారం వెలువడిన మెయిన్ డ్రాలో భాగంగా మొదటి రౌండ్లో నాగల్.. ప్రపంచ 26వ నంబర్ ఆటగాడు థామస్ మకాచ్ (చెక్ రిపబ్లిక్)తో తలపడనున్నాడు. గత సీజన్ షాంఘై మాస్టర్స్‌లో ప్రపంచ రెండో నంబర్ ఆటగాడు కార్లొస్ అల్కారజ్‌ను థామస్ ఓడించాడు.
ఇక ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 96వ స్థానంలో ఉన్న నాగల్ గతేడాది ఈ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరగా ఈ సీజన్లో మరోసారి సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇక ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్లు అయిన జన్నిక్ సిన్నర్, అరీనా సబలెంక, మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌కు తొలి రౌండ్లో సులువైన ప్రత్యర్థులు ఎదురయ్యారు.