సరిగ్గా మూడేండ్ల క్రితం ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమ్ఇండియా 1-4తో పరాజయం పాలై రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఐదు మ్యాచ్‌ల్లో కలిపి విరాట్ 593 పరుగులతో దుమ్మురేపినా.. జట్టు సమిష్టి ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమైంది. కుదురుకోని ఓపెనింగ్.. కోహ్లీకి కొరవడిన సహకారం.. పెద్దగా ప్రభావం చూపలేని బౌలింగ్‌తో టీమ్ఇండియా మూల్యం చెల్లించుకుంది.
ఇప్పుడు దాదాపు అదే జట్టుతో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన కోహ్లీసేన అద్భుత విజయాలతో దూసుకెళ్తున్నది. రెండు మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. మరి అప్పటికి ఇప్పటికీ ఏం మారింది. అంటే వచ్చే ఏకైక సమాధానం. ఆలోచనా తీరు! ఇంగ్లిష్ గడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం పెద్ద కష్టం కాదని టీమ్ఇండియా బలంగా విశ్వసిస్తున్నది! ఈ రెండు పర్యటనల్లోని తేడాలను ఓసారి పరిశీలిస్తే..
జట్టులో ఇద్దరు ముగ్గురు సభ్యులు తప్ప పెద్దగా మార్పులు లేవు. బ్యాటింగ్‌లో కీలకమైన విరాట్ కోహ్లీ, పుజారా, రహానే, రాహుల్ అప్పుడూ జట్టులో ఉన్నారు. బౌలింగ్ దళమైతే అచ్చంగా అదే. ఇషాంత్, షమీ, బుమ్రా, ఉమేశ్, అశ్విన్, జడేజా అప్పటి జట్టులోనూ ఉన్నారు. అదనంగా అప్పుడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సేవలు కూడా భారత జట్టుకు అందుబాటులో ఉన్నాయి. అయినా మనవాళ్లు ఒక్క టెస్టు విజయం సాధించడం తప్ప సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరి మూడేండ్లలో భారత జట్టు ఇంతలా మారడం వెనుక ఉన్న ప్రధాన కారణం దృక్పథమే. ఆసీస్ గడ్డపై వరుసగా రెండు సార్లు కంగారూలను ఓడించి సిరీస్‌లు కైవసం చేసుకోవడంతో మంచి జోరు మీదున్న టీమ్ఇండియా.. ఇంగ్లండ్‌లోనూ అదే సీన్ రిపీట్ చేయాలని ఆశిస్తున్నది. అందుకు తగ్గట్లే ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతూ.. ప్రస్తుతానికి సిరీస్‌లో పైచేయి సాధించింది. లార్డ్స్‌లో కనబర్చిన జోరునే కొనసాగిస్తే.. కోహ్లీ సేన సిరీస్ పట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు!
రోహిత్ రాకతో..
గత పర్యటనలో భారత జట్టుకు శిఖర్ ధావన్, మురళీ విజయ్ ఓపెనర్లుగా వ్యవహరించారు. ఈ జోడీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో రాహుల్‌కు అవకాశాలిచ్చినా.. ఎవరూ నిలకడగా పరుగులు చేయలేకపోయారు. చివరి టెస్టులో రాహుల్ శతక్కొట్టినా అప్పటికే నష్టం జరిగిపోయింది. అయితే అందుకు భిన్నంగా ఈ సారి భారత ఓపెనింగ్ జోడీ బాగా కుదిరింది. శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయాల పాలవడంతో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం దక్కించుకున్న లోకేశ్ రాహుల్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తున్నాడు. సంయమనం చూపుతూనే అవసరమైనప్పుడు వేగంగా పరుగులు రాబడుతున్నాడు. ముఖ్యంగా రోహిత్, రాహుల్ మధ్య సమన్వయం టీమ్ఇండియాను ఇంగ్లండ్ కంటే ఒక మెట్టు ఎత్తులో నిలిపింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో పరుగుల వరద పారించిన రోహిత్.. సుదీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్ అవతారం ఎత్తాక అదే జోరు కనబర్చడం భారత్‌కు బాగా కలిసొచ్చింది.
రాటు దేలిన పేస్..
గత పర్యటన తొలి టెస్టులో చోటు దక్కించుకోలేకపోయిన జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుత జట్టులో అందరికంటే నమ్మకమైన బౌలర్‌గా ఎదిగాడు. తొలి బంతి నుంచే నిప్పులు చెరుగుతున్న అతడిని ఎదుర్కోవడం ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌కు శక్తికి మించిన పనిగా మారింది. షమీ మరింత రాటుదేలగా.. ఇషాంత్ తన అనుభవాన్ని రంగరించి వికెట్లు సాధిస్తున్నాడు. గత పర్యటనలో నాలుగో పేసర్ బాధ్యతలు మోసిన హార్దిక్ పాండ్యా స్థానంలో ఈ సారి పూర్తిస్థాయి పేసర్ మహమ్మద్ సిరాజ్ అదరగొడుతున్నాడు. ఎలాంటి అలసట లేకుండా సుదీర్ఘ స్పెల్స్ వేస్తూ.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం వల్లే లార్డ్స్ రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా రూట్ సేనను రెండు సెషన్లలోనే ఆలౌట్ చేయగలిగింది. దీనికి తోడు గత పర్యటనలో ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేకపోవడం కూడా భారత జట్టుకు కలిసొచ్చిందనే చెప్పాలి.
చివర్లో మెరుపులు
గతంలో ఆరు వికెట్లు కోల్పోయిందంటే.. భారత్ ఆలౌటైనట్లే అనే అపవాదు ఉండేది.. ఈ మూడేండ్లలో ఈ విషయంలో టీమ్ఇండియా చాలా మారింది. చివరి వరుస బ్యాట్స్‌మెన్ తమవంతు కృషి చేస్తుండటంతో భారత్ మంచి స్కోర్లు చేయగలుగుతున్నది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత విజయాలను పరిశీలిస్తే.. చివరి వరుస బ్యాట్స్‌మెన్ చేసిన పరుగుల విలువేంటో తెలుస్తుంది. అంతెందుకు లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా మధ్య తొమ్మిదో వికెట్‌కు నమోదైన 89 పరుగుల భాగస్వామ్యమే మ్యాచ్‌పై టీమ్ఇండియాకు పట్టుచిక్కేలా చేసింది. ఇక బుమ్రా, అండర్సన్ మద్య నడిచిన వైరమైతే.. సిరీస్‌లోనే కొత్త జోష్ నింపింది. ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లు సంధించినా భయపడేది లేదంటూ ముందుకు సాగుతున్న టెయిలెండర్లు ఇదే జోరు కొనసాగించాలని ఆశిద్దాం!
కోహ్లీనే నమ్ముకోకుండా..
2014 ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న విరాట్ కోహ్లీ.. 2018లో కెప్టెన్‌గా జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. పది ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 149, 51, 23, 17, 97, 103, 46, 58, 49, 0 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 59.30 సగటుతో 593 పరుగులు సాధించాడు. అయితే అతడికి సహచరుల నుంచి సరైన సమయాల్లో సహకారం లభించకపోవడంతో జట్టు విజయాలు సాధించలేకపోయింది. ఈ సారి అందుకు భిన్నంగా రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ కేవలం 20.66 సగటుతోనే పరుగులు సాధించినా.. మిగిలినవాళ్లు బాధ్యతాయుతంగా ఆడటంతో జట్టు లార్డ్స్‌లో అద్వితీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి టెస్టు చివరి రోజు వర్షం అడ్డుపడకపోయుంటే ఇప్పటికే భారత్ 2-0తో సిరీస్‌లో ముందంజలో నిలిచేదే! ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీ మునపటి జోరు కనబరిస్తే టీమ్ఇండియాకు తిరుగుండదు!