కౌలాలంపూర్: మలేషియా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ముందంజ వేశాడు. మంగళవారం మొదలైన టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్యసేన్ 21-16, 15-21, 21-14తో జియాహోంగ్ జాసన్ టెహ్(సింగపూర్)పై అద్భుత విజయం సాధించాడు. గంటా 10నిమిషాల పాటు సాగిన పోరులో లక్ష్యసేన్ తొలి గేమ్ గెలిచి ఒకింత జోరుమీద కనిపించినా..రెండో గేమ్‌ను చేజార్చుకుని ఒత్తిడిలోకి వచ్చాడు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 3-4తో వెనుకబడ్డా వెంటనే పుంజుకుని పోటీలోకి వచ్చాడు.
ఈ క్రమంలో ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా డ్రాప్షాట్లు, నెట్‌గేమ్‌తో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుని గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మరో సింగిల్స్‌లో ఆయూశ్శెట్టి 21-12, 21-17తో లీ సి జియా(మలేషియా)పై గెలిచాడు. దూకుడైన ఆటతీరుకు తోడు కండ్లు చెదిరే స్మాష్‌లతో ప్రత్యర్థికి చెక్‌పెడుతూ మ్యాచ్‌ను 40 నిమిషాల్లోపే ముగించాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 11-21, 11-21తో రతనోక్ ఇంతనోన్(థాయ్‌లాండ్) చేతిలో ఘోరంగా ఓడింది.