న్యూఢిల్లీ: డబ్ల్యూబీఎల్ వరల్డ్ మ్యాచ్‌ప్లే బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ రజత పతకంతో మెరిశాడు. శనివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో అద్వానీ 7-8 తేడాతో డేవిడ్ కాజియర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 15 రౌండ్ల పాటు సాగిన తుది పోరులో అద్వానీ తొలుత 2-0తో ఆధిక్యంలో ఉన్నా..ఆ తర్వాత ప్రత్యర్థి పుంజుకోవడంతో మ్యాచ్ చేజారింది. ఆదివారం నుంచి మొదలుకానున్న ఐబీఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ టోర్నీలో అద్వానీ బరిలోకి దిగనున్నాడు.
గాయంతో ఫిలిప్స్ ఔట్
అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గాయం కారణంగా ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ ఫిలిప్స్ మెరుగైన చికిత్స కోసం స్వదేశం న్యూజిలాండ్‌కు బయల్దేరి వెళ్లినట్లు టైటాన్స్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ ఫిలిప్స్ వెంటనే మైదానాన్ని వీడాడు. ఈ సీజన్లో తుదిజట్టుకు ఆడలేకపోయిన ఈ స్టార్ క్రికెటర్‌ను గాయం దెబ్బతీసింది.