IND vs AFG: భారత క్రికెట్ అభిమానులను సుమారు ఏడాదికాలంగా వేధిస్తున్న ప్రశ్నకు జాతీయ సెలక్టర్లు సమాధానమిచ్చారు. దశాబ్దకాలంగా భారత క్రికెట్ బ్యాటింగ్ బాధ్యతలను మోస్తున్న సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (రోకో) లు తిరిగి 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టీ20లు ఆడబోతున్నారు. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో సెలక్టర్లు.. ఈ ఇద్దరు దిగ్గజాలు ఆడతారని సంకేతాలిచ్చారు. ఈ మేరకు అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సెలక్టర్లు జట్టును ప్రకటించారు. జనవరి 11, 14, 17 తేదీలలో భారత్-అఫ్గాన్లు మూడు టీ20లలో తలపడతాయి.
2022 నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత రోహిత్, కోహ్లీలు మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లో టీ20 మ్యాచ్ ఆడలేదు. దీంతో ఈ ఫార్మాట్లో రోకో శకం ముగిసినట్టేనని అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ గెలిస్తే ఈ దిగ్గజ బ్యాటర్లకు ఘనమైన సత్కారం దక్కుతుందని అనుకున్నా ఫైనల్ పోరులో భారత్ తడబడటంతో అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో ఈ ఇద్దరికీ మరో ఐసీసీ ట్రోఫీ ఆడించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న వేళ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోకోను తిరిగి టీ20 జట్టులోకి చేర్చింది. టీ20 వరల్డ్ కప్‌కు ఐదు నెలల సమయం ఉండటంతో ఈ ఇద్దరూ మరో ప్రపంచకప్ ఆడతారని అభిమానులకు చెప్పకనే చెప్పింది.
రోహిత్ నుంచి అనధికారికంగా టీ20 కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న హార్ధిక్ పాండ్యా తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌లలో సారథిగా వ్యవహరించిన సూర్కకుమార్ యాదవ్‌లు గాయాల కారణంగా ఈ సిరీస్ ఆడటం లేదు. అఫ్గాన్‌తో సిరీస్‌లో రోహిత్ శర్మనే జట్టును నడిపించనున్నాడు.
🚨 NEWS 🚨#TeamIndia’s squad for @IDFCFIRSTBank T20I series against Afghanistan announced 🔽
Rohit Sharma (C), S Gill, Y Jaiswal, Virat Kohli, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Sanju Samson (wk), Shivam Dube, W Sundar, Axar Patel, Ravi Bishnoi, Kuldeep Yadav,…
— BCCI (@BCCI) January 7, 2024
ఇక అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో హిట్‌మ్యాన్, కోహ్లీ రీఎంట్రీ ఇవ్వగా టీ20 జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు కూడా చోటు దక్కడం గమనార్హం. ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోగా అతడి స్థానంలో శాంసన్‌తో పాటు యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మకు సెలక్టర్లు చోటు కల్పించారు. టీ20 వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. జడేజా, బుమ్రా, సిరాజ్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ వంటి సీనియర్లకు ఈ సిరీస్‌లో విశ్రాంతినిచ్చారు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.
అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్