ఢిల్లీ: జర్మనీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత యువ షూటర్లు అదరగొడుతున్నారు. ఆదివారం జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ రజతం, కాంస్యం దక్కించుకుంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో నరేన్ ప్రణవ్-ఖాయతి చౌదరి ద్వయం.. 631 పాయింట్లు స్కోరు చేసి తృటిలో పసిడి పతకాన్ని కోల్పోయినా రజతంతో సరిపెట్టుకుంది.
చైనా జోడీ యుటింగ్-లివాన్లిన్.. 632.6 స్కోరుతో స్వర్ణం గెలుచుకుంది. 14వ షాట్ వరకూ భారత్,చైనా సమాన పాయింట్లతో సాగినా 15వ షాట్‌కు చైనా షూటర్లు.. 0.5 పాయింట్లు ఎక్కువ స్కోరు చేసి పసిడి కైవసం చేసుకున్నారు. ఇక కాంస్య పోరులో హిమాన్షు-శాంభవి జంట.. 629.5 పాయింట్లు స్కోరుతో అమెరికన్ జోడీ గ్రిఫిన్-స్పెన్సర్‌ను ఓడించి కాంస్యం దక్కించుకుంది.