హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ఐఎస్బీసీ)సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో క్రికెట్ టోర్నీల నిర్వహణకు సిద్ధమైంది. తొలుత గ్రామాల నుంచి మొదలు మండల, జిల్లా, రాష్ట్ర, జోనల్ స్థాయిల ద్వారా ప్లేయర్లను ఎంపిక చేయనుంది. ఇందుకోసం http://isbc.online అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే 12 నుంచి 16 ఏండ్ల వయసున్న ప్లేయర్లు తాము క్రికెట్ ఆడుతున్న వీడియోను అప్లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఎస్బీసీ ఫౌండర్-సీఈవో సునీల్‌బాబు ఆధ్వర్యంలో శనివారం మీడియా సమావేశం జరిగింది. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి..ఐఎస్బీసీ గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను అమితంగా అభిమానించే ఎమ్ఎస్ ధోనీ..రాంచీ అనే పట్టణం నుంచి వచ్చి దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించాడు’ అని అన్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే స్కూల్ వరల్డ్‌కప్ నిర్వహిస్తామని సునీల్‌బాబు పేర్కొన్నారు.