హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత ర్యాలీ డ్రైవర్, హైదరాబాదీ నవీన్ పులిగిల్ల అంతర్జాతీయ రేసింగ్‌లో మరోసారి మెరిశాడు. ప్రతిష్టాత్మక వరల్డ్ ర్యాలీ చాంపియన్‌షిప్ (డబ్ల్యూఆర్సీ)లో మరో పోడియం సాధించాడు. పరాగ్వేలో జరిగిన 11వ రౌండ్ ర్యాలీ డబ్ల్యూఆర్సీ3 విభాగంలో కో డ్రైవర్ మూసా షరీఫ్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. మొత్తం 357.64 కిలో మీటర్ల దూరాన్ని 5 గంటల 10 నిమిషాల 54.9 సెకండ్లలో పూర్తి చేశాడు.
ఈ విజయంతో డ్యూరాన్ రేసింగ్‌కు చెందిన నవీన్-మూసా జోడీ వరుసగా మూడో డబ్ల్యూఆర్సీ3 పోడియం సాధించి హ్యాట్రిక్ సాధించింది. నవీన్-మూసా జోడీ తదుపరి ఈ నెల10 నుంచి జరిగే డబ్ల్యూఆర్సీ 12వ రౌండ్ చిలీ ర్యాలీ రేస్‌లో పాల్గొననుంది.