బతుమి(జార్జియా): ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత యువ సంచలనం దేశ్‌ముఖ్ కొత్త చరిత్ర లిఖించింది. గేమ్ గేమ్‌కు ఆధిక్యం చేతులు మారుతున్న మెగాటోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన భారత ప్లేయర్‌గా దివ్య అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్ రెండో రౌండ్లో దివ్య 1.5-0.5 తేడాతో మాజీ ప్రపంచ చాంపియన్, టాన్ జాంగ్యి (చైనా)పై చారిత్రక విజయం సాధించింది. ఆది నుంచే తనదైన ఆధిపత్యం ప్రదర్శించిన 19 ఏండ్ల దివ్య కెరీర్లో చిరస్మరణీయ గెలుపు అందుకుంది.
వైల్డ్ అలాపిన్ సిసిలాయన్ డిఫెన్స్‌తో దివ్య ప్రత్యర్థిని కట్టిపడేసింది. మరో సెమీస్‌లో భారత సీనియర్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, లీ టాంగ్జి(చైనా) మధ్య రెండో రౌండ్ గేమ్ 1-1తో డ్రాగా ముగిసింది. స్కోర్లు సమం కావడంతో గురువారం జరిగే టైబ్రేక్ ద్వారా విజేత ఎవరో తేలనుంది. తుది పోరులో హంపి లేదా టాంగ్జితో దివ్య తలపడనుంది. ఫైనల్‌కు అర్హత సాధించడం ద్వారా దివ్య..ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించగా, ఇంకా రెండు బెర్తులు త్వరలో ఖరారు కానున్నాయి.