Indian Origin Cricketers | ప్రపంచంలో అత్యంత పాపులర్ గేమ్ ఏదైనా ఉందంటే అది క్రికెట్ మాత్రమే. దాదాపు ప్రతి ఒక్కరు బాల్యంలో క్రికెట్ ఆడే ఉంటారు. కొందరు మాత్రమే దానిని కొనసాగించి అందులో ప్రొఫెషనల్స్‌గా ఎదుగుతారు. సొంతదేశంలో అవకాశాలు లభించక ఆపై విదేశాలకు వెళ్లి స్థిరపడిన ఎందరో ఆ తర్వాత ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహించి సత్తా చాటారు. పరాయి జట్లలో వివక్షను అధిగమించి మరీ రాణించారు. అలాంటి వారిలో భారతీయ మూలాలున్న వారే ఎక్కువ. చరిత్ర పుస్తకాల్లో తమకంటూ ఓ పేజీని రాసుకున్న ఆ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందామా?
ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన నాసిర్ హుస్సేన్ (Nasser Hussain) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1999 నుంచి 2003 వరకు ఇంగ్లిష్ జట్టుకు స్కిప్పర్‌గా పనిచేసిన హుస్సేన్ జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. నాసిర్ మద్రాస్ (ప్రస్తుత చెన్నై)లో జన్మించాడు. తండ్రి తమిళ ముస్లిం. తల్లిది ఇంగ్లండ్. నాసిర్‌కు ఏడేళ్ల వయసున్నప్పుడు అతడి కుటుంబం ఇంగ్లండ్(England)కు వెళ్లి స్థిరపడింది. అంతకుముందు తన సోదరుడితో కలిసి చేపాక్ స్టేడియంలో క్రికెట్ ఆడేవాడు. ఇంగ్లండ్ వెళ్లాక క్రికెట్లో ఓ కోచ్ వద్ద శిక్షణ పొందాడు.1990లో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కెరియర్లో మొత్తం 96 టెస్టులు, 88 వన్డేలు ఆడి వరుసగా 5,764, 2,332 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 15 సెంచరీలు ఉన్నాయి.
Hamish Amla
హషీం మొహమ్మద్ ఆమ్లా(Hashim Mohammad Amla).. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మాజీ ఆటగాడు పుట్టింది డర్బన్‌లోనే అయినా మూలాలు మాత్రం భారత్‌లోనే ఉన్నాయి. అతడి తాత భారతీయుడే. సూరత్‌కు చెందిన ఆయన 1927లో దక్షిణాఫ్రికా(South Africa) వెళ్లి స్థిరపడ్డారు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన ఆమ్లా దక్షిణాఫ్రికా తరపున 124 టెస్టులు, 181 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 28, వన్డేల్లో 27 శతకాలు బాదాడు. ఓ టెస్టులో అతడు ట్రిపుల్ సెంచరీ (311 నాటౌట్) సాధించాడు. ఓ సఫారీ ఆటగాడు సాధించిన అత్యుత్తమ స్కోరు ఇదే. ఇప్పటికీ ఈ రికార్డు భద్రంగా ఉంది. అదొక్కటే కాదు, అతడి ఖాతాలో మరెన్నో రికార్డులు ఉన్నాయి.
Ravi Bopara
భారతీయ సిక్కు కుటుంబానికి చెందిన రవీందర్ సింగ్ బొపారా(Ravinder Singh Bopara) ఇంగ్లండ్ క్రికెటర్. ఇండియా నుంచి లండన్‌కు వలస వెళ్లిన ఆయన కుటుంబం అక్కడే స్థిరపడింది. 2007లో వన్డేల్లో అరంగేట్రం చేసిన రవి.. అదే ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. కౌంటీ క్రికెట్లో ఎస్సెక్స్ తరపున ఆడిన బొపారా 12వేలకు పైగా పరుగులు సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 133 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బొపారా 3 వేలకుపైగా పరుగులు సాధించాడు. ఓ వన్డే మ్యాచ్‌లో 38 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. బౌలింగులో ఓ ఇంగ్లిష్ క్రికెటర్ అత్యుత్తమ గణాంకాలు ఇవే.
Ish Sodhi
ఇండియా పుట్టిన న్యూజిలాండ్ క్రికెటర్ ఇందర్జిత్ సింగ్ సోది(Inderbir Singh Sodhi). పంజాబ్‌లోని లుధియానాలో ఓ సిక్కు కుటుంబంలో జన్మించాడు. సోధికి నాలుగేళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం న్యూజిలాండ్ (New Zealand)కు వలస వెళ్లింది. లెగ్ స్పిన్నర్, రైట్హ్యాండ బ్యాటర్ అయిన సోధి 2013లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2014లో వెస్టిండీస్‌పై టీ20ల్లో, 2015లో జింబాబ్వేతో మ్యాచ్‌లో వన్డేల్లో అడుగుపెట్టాడు. 2019 ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. 18 టెస్టుల్లో 49 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ల ఘనత కూడా ఉంది.
Stuart Clark
న్యూసౌత్‌వేల్స్‌లో జన్మించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ క్లార్క్(Stuart Clark). ఇతడి మూలాలు కూడా భారత్‌లోనే ఉన్నాయి. అతడి తండ్రి బ్రూస్ క్లార్క్ చెన్నైలో ఉండేవారు. తల్లి కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌మైన్స్ ప్రాంతానికి చెందినవారు. ఆస్ట్రేలియా తరపున 24 టెస్టులు, 39 వన్డేలు ఆడాడు. టెస్టుల్లోల 94 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. వన్డేల్లో 54 వికెట్లు తీసుకున్నాడు. అత్యుత్తమ ప్రదర్శన 4/54. 2007 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా(Australia) జట్టులో సభ్యుడు. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీసుకున్నాడు. 2018లో నంబర్ వన్ టీ20 బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
Jeetan Patel
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ అయిన జీతన్ శశి పటేల్(Jeetan Shashi Patel) గుజరాత్‌లోని నవసారికి చెందిన గుజరాతీ కుటుంబంలో జన్మించాడు. 2005-2017 మధ్య న్యూజిలాండ్ (New Zealand)కు ప్రాతినిధ్యం వహించాడు. 24 టెస్టులు ఆడి 65 వికెట్లు తీసుకున్నాడు. 43 వన్డేల్లో 49 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 892 వికెట్లు తన పేర రాసుకున్నాడు. పదిసార్లు పది వికెట్ల ఘనత సాధించాడు. 38 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గానూ పనిచేశాడు.
Rohan Kanhai
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ అయిన రోహన్ కన్హాయి(Rohan Kanhai) మూలాలు కూడా ఇండియాలోనే ఉన్నాయి.1975లో ప్రపంచకప్ గెలిచిన కరీబియన్ (West Indies) జట్టులో సభ్యుడు కూడా. ఫైనల్స్‌లో అర్ధ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 79 టెస్టులు ఆడి 15 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. టాప్ స్కోరు 256 పరుగులు. విండీస్ తరపున ఏడు వన్డేలకు ప్రాతినిధ్యం వహించి 164 పరుగులు చేశాడు. అప్పట్లో అతడిని గ్రేట్ బ్యాట్స్‌మన్‌గా పరిగణించేవారు. భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వంటి వారికి అతడే ప్రేరణ.
Keshav Maharaj
కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) సౌతాఫ్రికా లెగ్ స్పిన్నర్. డర్బన్‌లో పుట్టి పెరిగిన కేశవ్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సుల్తాన్‌పూర్‌కు చెందినవారు. సఫారీ జట్టు తరపున 49 టెస్టులు ఆడి ఏకంగా 158 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా జట్టులో రెండో అత్యధిక వికెట్ల రికార్డు అతడి పేరునే ఉంది. అలాగే, టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో సౌతాఫ్రికా (South Africa) క్రికెటర్ కూడా అతడే. 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 అరంగేట్ర మ్యాచ్‌లోనే జట్టుకు సారథ్యం వహించాడు.
Ajaj Patel
ముంబైలో జన్మించిన అజాజ్ పటేల్ (Ajaz Patel) న్యూజిలాండ్ బౌలర్. 1996లో అతడి కుటుంబం ముంబై నుంచి న్యూజిలాండ్ (New Zealand)కు వలస వెళ్లింది. అక్కడే క్రికెట్లో శిక్షణ పొందిన అజాజ్ 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2021లో కివీస్-టీమిండియా మధ్య జరిగిన రెండో టెస్టులో పదికి పది వికెట్లు తీసుకుని రికార్డు సృష్టించాడు. 1999లో అనిల్ కుంబే (Anil Kumble) ఈ ఫీట్ సాధించిన తర్వాత 22 ఏళ్లకు ఆ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తంగా ఆ ఘనత సాధించిన మూడో బౌలర్. అంతకుముందు 1956లో జిమ్ లేకర్ (Jim Laker) పదికి పది వికెట్లు తీసుకున్నాడు. జట్టు ఓడిపోయినప్పటికీ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు (14) పడగొట్టిన ఏకైక బౌలర్‌గా తన పేరున రికార్డు రాసుకున్నాడు.
Ashish Bagai
కెనాడా జట్టు మాజీ కెప్టెన్ ఆశిష్ బగాయ్ (Ashish Bagai) 11 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఢిల్లీలోనే నివసించాడు. అక్కడి సెయింట్ కొలంబా స్కూల్లో చదువుకున్నాడు. అతడు పుట్టడానికి ముందు కెనడా (Canada) మూడు వన్డేలు మాత్రమే ఆడింది. ఆ తర్వాత జరిగిన ప్రతి వన్డేలోనూ కెనడా జట్టుకు ఆశిష్ ప్రాతినిధ్యం వహించాడు. 59 వన్డేలు ఆడి 38 సగటుతో 1,922 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో రెండు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 137 నాటౌట్. ఆశిష్ కెప్టెన్సీలో కెనడా జట్టు 2011 ప్రపంచకప్‌లో ఆడింది.