లండన్: ప్రతిష్టాత్మక ప్రపంచ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల టీమ్ శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన మెగాటోర్నీలో భారత్ 3-0తో ట్యునీషియాపై అద్భుత విజయం సాధించింది. మానుశ్ షా, మానవ్ థక్కర్, హర్మిత్ దేశాయ్ జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. మానుశ్ షా 11-5, 9-11, 11-3, 11-5తో ఎసిద్ వస్సిమ్పై అలవోకగా గెలిచాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన మరో గేమ్‌లో మానవ్ థక్కర్ 11-3, 11-3, 11-3తో యూసెఫ్ అద్లిపై సునాయాస విజయం ఖాతాలో వేసుకున్నాడు. హర్మిత్దేశాయ్ 11-5, 11-4, 11-8తో అబుబాకెర్ బౌరెస్ను చిత్తుగా ఓడించాడు. స్లోవేకియా, గ్వాటెమాల, ట్యునీషియాతో కలిసి గ్రూపు-7లో ఉన్న భారత్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నది. మరోవైపు మహిళల విభాగంలో ఉగాండ పోటీకి గైర్హాజరు కావడంతో భారత్ 3-0తో ముందంజ వేసింది. ఇదిలా ఉంటే ప్రపంచ చాంపియన్‌షిప్ సన్నద్ధత కోసం సాయ్ రూ.90 లక్షలు మంజూరు చేసింది.