రాజ్‌గిర్ (బీహార్): మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 3-2తో దక్షిణ కొరియాపై గెలిచింది. భారత్ తరఫున సంగీతా కుమారి 3వ నిమిషంలోనే తొలి గోల్ చేసి జట్టును ఆధిక్యంలో నిలపగా యువ స్ట్రైకర్ దీపికా (20, 57వ ని.) రెండు కీలక గోల్స్ చేసింది. ఆట అర్ధభాగం ముగిసేసరికి 2-0తో భారత్ ఆధిక్యంలో ఉన్నా మూడో క్వార్టర్లో దక్షిణకొరియా నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి అనూహ్యంగా పుంజుకుంది. యురి లీ (34వ ని.), కెప్టెన్ యున్బి చియోన్ (38వ ని.) చెరో గోల్ చేశారు. ఇక మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా దీపికా 57వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలవడంతో భారత్‌కు విజయం సొంతమైంది.