బెంగళూరు: భారత హాకీ దిగ్గజం మాన్యుయెల్ ఫ్రెడరిక్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1972లో మునిచ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ఫ్రెడరిక్.. ఆ టోర్నీలో జట్టుకు గోల్‌కీపర్‌గా సేవలందించారు. సుమారు ఏడాదికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని దవాఖానలో కన్నుమూసినట్టు ఫ్రెడరిక్ కుటుంబసభ్యులు తెలిపారు.
1947లో కేరళలోని కన్నూరులో పుట్టిన ఆయన.. ఆ రాష్ట్రం నుంచి ఒలింపిక్ పతకం గెలిచిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కారు. 1971లో జాతీయ జట్టులోకి వచ్చిన ఆయన.. ఏడేండ్ల పాటు గోల్‌కీపర్‌గా భారత విజయాల్లో కీలకపాత్ర పోషించారు.