దోహా : ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి కాంస్యం గెలిచాడు. ఆదివారం ముగిసిన ర్యాపిడ్ చాంపియన్‌షిప్స్ ఓపెన్ విభాగంలో 13 రౌండ్ల తర్వాత 9.5 పాయింట్లు సాధించిన ఈ తెలంగాణ కుర్రాడు.. వ్లాదిస్లావ్ (రష్యా), నీమన్ (జర్మనీ), పెరీజ్ (అమెరికా)తో పాటు సమాన పాయింట్లతో నిలిచాడు. కానీ టైబ్రేక్‌లో వ్లాదిస్లావ్ (99, 105.5) రెండో స్థానంతో రజతం నెగ్గితే అర్జున్ (98, 104.5) కాంస్యం సొంతం చేసుకున్నాడు. నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ (10.5 పాయింట్లు) విజేతగా నిలిచి ఈ టోర్నీలో ఆరో స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ విజయంతో ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్స్‌లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్‌కు పతకం సాధించిన (పురుషుల విభాగంలో) తొలి ప్లేయర్‌గా అర్జున్ చరిత్ర సృష్టించాడు.
13 రౌండ్లుగా సాగిన ఈ టోర్నీలో తొలిరోజే వరుసగా నాలుగు విజయాలు సాధించిన అర్జున్.. రెండో రోజు నాలుగు రౌండ్లలో ఒక విజయం, రెండు డ్రాలతో కాస్త వెనుకబడ్డాడు. కానీ మూడో రోజు తొలి గేమ్‌లోనే సామ్ సెవియన్ (అమెరికా)తో మ్యాచ్‌ను గెలుచుకున్న అతడు.. కీలకమైన 12వ (రౌఫ్ మమెదొవ్- అజర్బైజాన్), 13వ (అలగ్జాండర్ షిమనోవ్-ఉక్రెయిన్) రౌండ్స్‌లో గెలిచి పతకం రేసులోకి వచ్చాడు. తనకు అచ్చొచ్చిన ఆటలో ఒత్తిడిని చిత్తుచేస్తూ టైబ్రేక్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసి పతకం కైవసం చేసుకున్నాడు. ప్రపంచ చెస్ టోర్నీలో అర్జున్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోనేరు హంపి కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.
ర్యాపిడ్ విభాగంలో సత్తాచాటిన అర్జున్.. బ్లిట్జ్‌లోనూ జోరు కొనసాగిస్తున్నాడు. సోమవారం ఆరంభమైన ఈ పోటీల్లో భాగంగా అర్జున్.. కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. ఈ ఇరువురి మధ్య తొమ్మిదో రౌండ్లో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్.. కార్ల్‌సన్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో 11 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో నొడిర్బెక్ (ఉజ్బెకిస్థాన్)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. నేడు జరుగబోయే మిగిలిన 5 రౌండ్లతో ఈ టోర్నీలో విజేత ఎవరో తేలనుంది.