Gurindervir Singh | బెంగళూరు : ఇండియన్ అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి టోర్నీలో పంజాబ్ యువ అథ్లెట్ గురిందర్వీర్సింగ్ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. శుక్రవారం ఉత్కంఠగా సాగిన పురుషుల 100మీటర్ల రేసును గురిందర్వీర్సింగ్ 10.20 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకంతో మెరిశాడు. మణికంఠ హోబ్లిధార్ నిరుడు నెలకొల్పిన 10.23 సెకన్ల రికార్డును తాజాగా ఈ పంజాబ్ యువ అథ్లెట్ తిరుగరాశాడు.
దీనికి తోడు 2021లో తన పేరిటే ఉన్న 10.27సెకన్ల రికార్డును సింగ్ సవరించాడు. చివరి దాకా ఆసక్తికరంగా సాగిన రేసులో గురిందర్ అగ్రస్థానంలో నిలువగా, మణికంఠ(10.22సె), అమ్లాన్ బొర్గోహైన్(10.43సె) రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. భారత 100మీటర్స్ టాప్ రేసర్‌గా కొనసాగుతున్న అనిమేశ్ కుజుర్ ఈ పోటీలో పాల్గొనలేకపోయాడు.