Indian Football Team : ఆసియా కప్ క్వాలిఫయర్పై గురి పెట్టిన భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు ఘోర అవమానం జరిగింది. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన హెడ్‌కోచ్ ఖలీద్ జమిల్(Khalid Jamil), ఆటగాళ్లను స్టేడియం లోపలికి అనుమతించలేదు. ఫలితంగా మ్యాచ్‌కు ముందు జరగాల్సిన మీడియా సమావేశం జరుగలేదు. ఫుట్‌బాల్ టీమ్‌ను స్టేడియంలోకి అనుమతించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈమధ్య కాలంలో పేలవమైన ఆటతో నిరాశపరుస్తున్న భారత ఫుట్‌బాల్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్(HongKong)తో మ్యాచ్‌కు సిద్ధమవ్వాలనుకున్న బ్లూ టైగర్స్‌కు కొచ్చిలోని స్టేడియం లోపలికి అనుమతి లభించలేదు. గురువారం కోచ్ ఖలీద్ జమిల్, ముగ్గురు ఆటగాళ్లు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రాక్టీస్ చేసేందుకు వెళ్లారు. కానీ, ఆలిండియా ఫుట్‌బాల్ సంఘం బాకీ డబ్బులు చెల్లించని కారణంగా వారిని సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
Another shameful episode in Indian #football as coach, players denied stadium entry over non-paymenthttps://t.co/UTig8HJUW7
— News9 (@News9Tweets) March 27, 2026
ఈ ఘటనపై కొచ్చి ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు నవాస్ మీరన్ మాట్లాడుతూ.. అలా ఏం జరగలేదని మొదట బుకాయించాడు. చిన్న సాంకేతిక సమస్య ఏర్పడిందని.. అందుకే కోచ్, ఆటగాళ్లను అనుమతించలేదని అతడు చెప్పాడు. అయితే.. షెడ్యూల్ ప్రకారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని మీరన్ వెల్లడించాడు. ‘ఆసియా కప్ క్వాలిఫయర్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. గురువారం జరిగిన సంఘటనకు చిన్నపాటి సాంకేతిక సమస్యే కారణం. ఈ సమస్య త్వరగా పరిష్కారం కానుంది’ అని మీరన్ పేర్కొన్నాడు. ఆసియా క్వాలిఫయర్స్‌లో భాగంగా మార్చి 31వ తేదీన హాంకాంగ్‌తో భారత జట్టు తలపడనుంది.