న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరోసారి సత్తా చాటింది. ర్యాపిడ్ ఈవెంట్లో కోనేరు హంపి చాంపియన్‌గా నిలవగా తాజాగా బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి కాంస్యంతో మెరిసింది. ఈ టోర్నీలో కాంస్యం గెలవడం ఆమెకు ఇదే మొదటిసారి కావడం విశేషం. బుధవారం జరిగిన బ్లిట్జ్ నాకౌట్ దశలో వైశాలి.. క్వార్టర్స్‌లో 2.5-1.5తో జు జినర్ (చైనా)ను ఓడించింది. కానీ సెమీస్‌లో 0.5-2.5తో మరో చైనా అమ్మాయి జు వెంజున్ చేతిలో పరాభవం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో వెంజున్.. 3.5-2.5తో తన దేశానికే చెందిన లీ టింగ్జీని ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. కాంస్యం గెలిచిన వైశాలిపై భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ప్రశంసలు కురిపించాడు. ఇక పురుషుల విభాగంలో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్, రష్యా ఇయాన్ నెపొమ్నియాచి సంయుక్తంగా టైటిల్‌ను పంచుకున్నారు.