నోయిడా : ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ పతకాలే లక్ష్యంగా సాగుతున్న భారత బాక్సర్లు.. సొంతగడ్డపై జరుగుతున్న 2025 వరల్డ్ బాక్సింగ్ కప్‌లో సత్తాచాటుతున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన పలు సెమీస్ మ్యాచ్‌ల్లో ఏకంగా 8 మంది భారత బాక్సర్లు ఫైనల్ చేరడం విశేషం. మాజీ యూత్ వరల్డ్ చాంపియన్, సుమారు ఏడాదిన్నర విరామం తర్వాత బాక్సింగ్ రింగ్‌లోకి వచ్చిన అరుంధతి చౌదరి.. మహిళల 70 కిలోల సెమీఫైనల్లో జర్మనీ స్టార్ రెజ్లర్ లియోనీ ముల్లర్‌ను ఆర్ఎస్సీ విధానంతో మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఆమెతో పాటు వరల్డ్ చాంపియన్ మీనాక్షి (48 కి.) తన ఫామ్‌ను కొనసాగిస్తూ 5-0తో బక్ చొ-రొంగ్ (కొరియా)పై ఏకపక్ష విజయం సాధించింది. అంతేగాక నుపుర్ షిరోన్ (80+ కి.), ప్రవీణ్ హుడా (60 కి.) సైతం సెమీస్‌లో తమ ప్రత్యర్థులను చిత్తుచేశారు. 22 ఏండ్ల ప్రీతి పవార్ (54 కి.).. సెమీస్‌లో టోక్యో ఒలింపిక్ మెడలిస్, మూడు సార్లు వరల్డ్ చాంపియన్ అయిన హువాంగ్ సియావొ-వెన్కు షాకిచ్చింది. పురుషుల 80 కిలోల క్యాటగిరీలో అంకుష్ పంగల్, నరేందర్ బర్వాల్ (90 + కి.), అవినాశ్ జమ్వాల్ (65 కి.) ఫైనల్స్‌కు చేరి కనీసం రజతాన్ని ఖాయం చేశారు.