David Warner | ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. సామాజిక మాధ్యమాల్లో ఆటాడుకుంటున్నది. ఇటీవల భారత్‌తో వన్డే సిరీస్ సందర్భంగా వార్నర్ స్టాన్స్ మార్చి బ్యాటింగ్ చేయడంపై తనదైన శైలిలో కామెంట్స్ చేసిన సింధు.. తాజాగా మరోమారు వార్నర్ రీల్స్‌కు వినూత్న రీతిలో కామెంట్ పెట్టింది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సుదీర్ఘ అనుభవం ఉన్న వార్నర్.. గతంలో పలుమార్లు తెలుగు పాటలకు తనదైన శైలిలో స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరించిన విషయం తెలిసింతే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వార్నర్ తరచూ తన షాట్స్, రీల్స్‌తో, ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటాడు. ఈ నేపథ్యంలో శనివారం వార్నర్ మరో రీల్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
తక్కువ బరువు గల డంబుల్స్తో ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోను వార్నర్ పోస్టు చేయగా.. ‘జాగ్రత్త డేవిడ్.. అంతంత బరువులు ఎత్తుతున్నావ్ చూసుకో’ అని సింధు కామెంట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘వార్నర్న్ను సింధు వదిలిపెట్టేలా లేదు’ అని ఓ అభిమాని అంటే.. ‘డేవిడ్ భాయ్ అమ్మాయిలతో జర భద్రం’ అని మరొకరు స్పందించారు. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటూ ఆస్వాదించే వార్నర్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక క్రికెట్ విషయానికి వస్తే.. వార్నర్ ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ ఆడేందుకు భారత్‌లో పర్యటిస్తున్నాడు.