మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4లో భారత ఆర్చర్, తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత రజతంతో మెరిసింది. చికిత, ఏపీ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్‌తో కూడిన మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో ఈ పతకం అందుకుంది. వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన యంగ్‌స్టర్ ప్రీతిక డబుల్ ధమకా మోగించింది.
శనివారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఫైనల్లో మూడో ర్యాంకర్ భారత్ 228-232తో ప్రపంచ 14వ ర్యాంకర్ కొలంబియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రీతిక ఆరు సార్లు 10 పాయింట్లు సాధించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినప్పటికీ.. సీనియర్ ఆర్చర్లు జ్యోతి సురేఖ, చికిత లయ తప్పడం జట్టు విజయ అవకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా స్టార్ ఆర్చర్ సురేఖ మూడు సార్లు మాత్రమే 10 పాయింట్లు కొట్టి నిరాశపరిచింది. వ్యక్తిగత కాంస్య పతక పోరులో ప్రీతిక 145-142తో ప్రపంచ 11వ ర్యాంకర్ హజల్ బురున్ (తుర్కియే)పై గెలిచింది.