న్యూయార్క్: భారత టెన్నిస్ డబుల్స్ ఆటగాడు యుకీ బాంబ్రీ యూఎస్ ఓపెన్‌లో సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. పురుషుల డబుల్స్‌లో బాంబ్రీ.. న్యూజిలాండ్ సహచరుడు మైకేల్ వీనస్‌తో కలిసి ఈ టోర్నీ సెమీస్‌కు అర్హత సాధించాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో బాంబ్రీ-వీనస్ ద్వయం.. 6-3, 6-7 (6/8), 6-3తో 11వ సీడ్ నికోలా మెక్టిక్ (క్రొయేషియా), భారత సంతతి అమెరికా ఆటగాడు రాజీవ్ రామ్ జోడీని ఓడించి లాస్ట్ 4కు చేరింది. సీనియర్ విభాగంలో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌కు చేరడం బాంబ్రీకి ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఇండో-న్యూజిలాండ్ జోడీ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ జర్మనీ ద్వయం కెవిన్-పుటెజ్‌ను చిత్తుచేసి క్వార్టర్స్ చేరిన విషయం విదితమే. సెమీస్‌లో బాంబ్రీ-వీనస్.. ఆరో సీడ్ బ్రిటీష్ ద్వయం జొ సల్సిబరీ, నీల్ కుప్సుకితో తలపడనుంది.
జూనియర్ విభాగంలో ఒక దశలో ప్రపంచ నెంబర్‌వన్‌గా నిలిచిన బాంబ్రీ.. 2009 ఆస్ట్రేలియా ఓపెన్ బాయ్స్ చాంపియన్‌గా అవతరించడమే ఇప్పటిదాకా అతడి కెరీర్లో అత్యుత్తమం. 33 ఏండ్ల బాంబ్రీ కొన్నేండ్లుగా గాయాలు, నిలకడ లేమితో సతమతమయ్యాడు. సింగిల్స్ విభాగంలో విఫలమైన అతడు డబుల్స్‌కు మారాక నిలకడగా రాణిస్తున్నాడు. సీనియర్ గ్రాండ్‌స్లామ్ క్యాటగిరీలో ఒక టోర్నీ సెమీస్ చేరడం అతడికి ఇదే మొదటిసారి. తద్వారా డబుల్స్‌లో లియాండర్ పేస్, మహేశ్ భూపతి, రోహన్ బోపన్న తర్వాత బాంబ్రీ వారి అడుగుజాడల్లో నడుస్తున్నాడు.
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సిన్నర్ జోరు కొననసాగుతున్నది. క్వార్టర్స్‌లో ఒకటో సీడ్ సిన్నర్.. 6-1, 6-4, 6-2తో ఇటలీకే చెందిన లొరెంజొ ముసెట్టిని ఓడించి వరుసగా ఐదో గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరుకున్నాడు. రెండు గంటల పాటు సాగిన పోరులో ఈ ఇటలీ సంచలనం తొలి సెట్‌ను 27 నిమిషాల్లోనే ముగించాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరిన ముసెట్టి.. సిన్నర్ జోరు ముందు నిలువలేకపోయాడు. హార్డ్ కోర్ట్లలో సిన్నర్‌కు ఇది వరుసగా 26వ విజయం. మరో క్వార్టర్స్‌లో 25వ సీడ్ ఫెలిక్స్ అగర్ అలిఅస్సామి (కెనడా).. 4-6, 7-6 (9/7), 7-5, 7-6 (7/4)లో 8వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)ను చిత్తుచేశాడు. 4 గంటల 10 నిమిషాల పాటు నాలుగు సెట్లలో హోరాహోరీగా జరిగిన పోరులో కెనడా కుర్రాడు.. మినార్ను ఓడించి 2021 తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు అర్హత సాధించాడు.లాస్ట్ 4లో ఫెలిక్స్.. సిన్నర్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
మహిళల సింగిల్స్‌లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. రెండో సీడ్ పోలండ్ భామ ఇగా స్వియాటెక్‌కు షాక్ తగిలింది. క్వార్టర్స్ పోరులో స్వియాటెక్.. 4-6, 3-6తో అమెరికా అమ్మాయి అమంద అనిసిమొవ చేతిలో ఓటమి పాలైంది. ఈ ఇద్దరూ కొద్దిరోజుల క్రితమే లండన్‌లో ముగిసిన వింబుల్డన్ ఫైనల్లో తలపడగా అప్పుడు స్వియాటెక్ వీరవిహారం (6-0, 6-0తో) చేసి టైటిల్‌ను గెలుచుకుంది. కానీ తాజాగా అదృష్టం అమంద వైపు నిలవడంతో ఆమె వింబూల్డన్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నైట్టెంది. అనిసిమోవాకు యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరడం ఇదే ప్రథమం. మరో పోరులో నవొమి ఒసాకా (జపాన్).. 6-4, 6-3 (7/3)తో కరోలినా ముచోవా (చెక్)ను చిత్తు చేసి సెమీస్‌లోకి ప్రవేశించింది. సెమీస్‌లో అమంద.. ఒసాకాను ఢీకొననుంది.