హైదరాబాద్, ఆట ప్రతినిధి: మ్యాచ్ టిక్కెట్ల విషయంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) పకడ్బందీ చర్యలకు దిగుతున్నది. ఈ నెల 18న ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఇందుకు సంబంధించి టిక్కెట్లన్నీ ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచుతున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. బుధవారం స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్, సూపర్వైజర్ కమిటీ సభ్యుడు వంకా ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజర్ మీడియాతో మాట్లాడుతూ ‘భారత్, కివీస్ వన్డే మ్యాచ్ టిక్కెట్లు ఆఫ్‌లైన్‌లో విక్రయించడం లేదు. కేవలం పేటీఎమ్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నాం. దాదాపు నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్‌లో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇందుకోసం అభిమానులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆన్లైన్లో ఈ నెల 13 నుంచి 16 వరకు టిక్కెట్లు అమ్ముతారు. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో 15వ తేదీ నుంచి 18 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు ఇక్కడ టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. స్టేడియం మొత్తం సామర్థ్యం 39, 112 కాగా 29, 417 టిక్కెట్లు అమ్మకానికి ఉంచుతున్నాం’ అని అన్నాడు.