IND-W vs ENG-W ODI | ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు అద్భుతంగా రాణించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. ఆతిథ్య జట్టుతో డర్హమ్ వేదికగా మూడో వన్డే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా 50 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 318 పరుగులు భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్ (102 పరుగులు) చేసి కెరీర్లో ఏడో శతకాన్ని నమోదు చేసింది. 82 బంతుల్లో 14 ఫోర్ల సహాయంతో 102 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (50 పరుగులు)తో నాలుగో వికెట్‌కు 110 పరుగులు జోడించింది. హర్లీన్ (45), మంధన (45) రాణించారు. చివరలో వికెట్ కీపర్ కం బ్యాటర్ రిచా ఘోష్ 18 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 38 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. అయితే, 40 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసిన టీమిండియా.. చివరి పది ఓవర్లలో ఏకంగా 120 పరుగులు చేసింది. తొలుత 54 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్.. సెంచరీని మిగతా 28 బంతుల్లోనే పూర్తి చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు లారెన్ బెల్, లారెన్ ఫైలర్, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.
టీమిండియా విధించిన 319 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ 305 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్ క్రాంతి గౌడ్ తొలుత ప్రారంభంలోనే రెండు వికెట్లు తీసి భారత జట్టులో ఉత్సాహం నింపింది. ఆమీ జోన్స్ (4), టామ్సిన్ బ్యూమాంట్ (2) కాంత్రి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత ఎమ్మా లాంబ్ (68), నట్ స్కీవర్ బ్రంట్ (98) ఇంగ్లండ్ స్కోర్ బోర్డ్‌ను పరుగులెత్తించారు. మూడో వికెట్‌కు ఇద్దరు 160 పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇంగ్లండ్ 170 పరుగుల వద్ద ఎమ్మా లాంబ్ను చరణి క్లీన్ బౌల్డ్ చేసి.. ఈ జోడీని విడదీసింది. ఆ తర్వాత నటాలీ స్కీవర్ బ్రంట్‌ను దీప్తిశర్మ పెవిలియన్‌కు పంపింది. నటాలీ తృటిలో సెంచరీ మిస్సయ్యింది. నటాలీ 105 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో 98 పరుగులు చేసి అవుట్ అయ్యింది. ఆ తర్వాత ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ (44), చార్లీ డీన్ (21) రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించకపోతే ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లలో క్రాంతి గౌడ్‌కు ఆరు వికెట్లు, దీప్తిశర్మ, శ్రీచరణికి రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో నెగ్గింది. ఇంతకు ముందు టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.