గుమి (దక్షిణ కొరియా): ఏషియన్ అథ్లెటిక్స్‌లో తొలిరోజే భారత్‌కు రెండు పతకాలతో అదరగొట్టింది. పురుషుల పదివేల మీటర్ల పరుగు పందెంలో యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ స్వర్ణంతో సత్తా చాటగా 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో సెర్విన్ సెబాస్టియన్ కాంస్యంతో మెరిశాడు. 26 ఏండ్ల గుల్వీర్.. రేసును 28 నిమిషాల 38.63 సెకన్లతో పూర్తిచేసి పసిడి సాధించగా జపాన్ అథ్లెట్ మిబుకి సుజూకీ (28:43.84)కి రజతం, బహ్రెయిన్‌కు చెందిన అల్బర్ట్ కిబిచి (28:46.82) కాంస్యం గెలిచాడు. ఇదే రేసులో భారత్‌కే చెందిన సవన్ బర్వల్ (28:50.53) నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక సెబాస్టియన్.. 20 కి.మీ. రేసును ఒక గంటా 21 నిమిషాల 13.60 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచాడు. ఇవే పోటీలలో భాగంగా జరిగిన మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో అన్నూ రాణి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 1500 మీటర్ల రేసులో యూనుస్ షా ఫైనల్‌కు అర్హత సాధించాడు.