మ్యూనిచ్: జర్మనీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. పోటీల తొలిరోజైన మంగళవారం భారత యువ షూటర్ ఎలావెనిల్ వాలరివన్ కాంస్య పతకంతో మెరిసింది. మహిళల 10మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగం ఫైనల్లో ఎలావెనిల్ 231.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం ఒడిసిపట్టుకుంది. ఇదే కేటగిరీలో జిఫీ వాంగ్ (252.7, చైనా), ఎన్జీ క్వోన్ (252.6, కొరియా) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.
అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ పోరులో ఎలావెనిల్ 635.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 2023లో నాన్సి (634.7)పేరిట ఉన్న జాతీయ రికార్డును తాజాగా ఎలావెనిల్ అధిగమించింది. మరోవైపు మహిళల 25మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ (294)నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే కేటగిరీలో పోటీపడ్డ దివ్య (11), మనుభాకర్ (15), సిమ్రన్ప్రీత్కౌర్(24), రాహి సర్నోబత్ (47) తీవ్రంగా నిరాశపరిచారు.