చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ హోరాహోరీగా తలపడ్డాయి. ప్రతిష్ఠాత్మక ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో దాయాది పాక్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. టోర్నీలో అపజయమెరుగని టీమ్ఇండియా ఘన విజయంతో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్ డబుల్ గోల్స్‌తో భారత్ విజయదుందుభిమోగించింది. గెలిస్తే గానీ నిలువలేని పరిస్థితుల్లో పోటీకి దిగిన పాక్..భారత్‌ను నిలువరించలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చెన్నై: ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న టీమ్ఇండియా..టైటిల్ దక్కించుకునేందుకు మరింత చేరువైంది. బుధవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై అభిమానుల మద్దతును తమకు అనుకూలంగా మలుచుకుంటూ టీమ్ఇండియా ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్ విషయానికొస్తే…కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్(15ని), (23ని) డబుల్ గోల్స్ చేయగా, జుగ్రాజ్ సింగ్(36ని), ఆకాశ్‌దీప్‌సింగ్(55ని) ఒక్కో గోల్ నమోదు చేశారు. గంట పాటు జరిగిన పోరులో పాక్ కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఈ విజయంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక డ్రాతో భారత్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఈ నెల 11న జరిగే సెమీస్‌లో జపాన్‌తో భారత్ తలపడుతుంది.
హర్మన్ డబుల్ ధమాకా : అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన పోరులో పాక్‌పై భారత్‌దే పైచేయి అయ్యింది. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటి వరకు పాక్..భారత్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా దాడులు చేసేందుకు ప్రయత్నించింది. అయితే టీమ్ఇండియా కూడా అంతే దీటుగా బదులివ్వడంతో గోల్ సాధ్యం కాలేదు. ఒక రకంగా ఇరు జట్లు గోల్ లక్ష్యంగా ఒకరి పోస్ట్‌పై ఒకరు దాడులకు పూనుకున్నారు. దీంతో తొలి క్వార్టర్ గోల్ లేకుండానే ముగిసింది. రెండో క్వార్టర్ ఆరంభంలోనే హర్మన్‌ప్రీత్..పెనాల్టీ కార్నర్ ద్వారా భారత్‌కు తొలి గోల్ అందించాడు. అదే దూకుడు కనబరుస్తూ మరో పది నిమిషాల్లోపే దక్కిన కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 2-0కు చేరుకుంది. ఇలా ఆధిక్యాన్ని పెంచుకునే క్రమంలో పాక్‌పై భారత్ వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. మూడో క్వార్టర్లో జుగ్రాజ్సింగ్ గోల్ చేస్తే..ఆఖర్లో ఆకాశ్‌దీప్‌సింగ్ గోల్ చేయడంతో భారత్ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు పాక్ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
ఆగస్టు 11: మలేషియా X కొరియా
భారత్ X జపాన్