లిమా: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల మోత మోగిస్తున్నారు. వారి గురికి పతకాలన్నీ భారత ఖాతాలో చేరుతున్నాయి. గురువారం జరిగిన మహిళల 25 మీటర్ల షూటింగ్లో మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్, నామ్య కపూర్‌తో కూడిన భారత బృందం స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక పురుషుల జట్టు (మాలిక్, శార్దూల్ విహాన్, వివాన్ కపూర్) రజతం సాధించడంతో భారత ఖాతాలో 20వ పతకం చేరింది. కాగా అమ్మాయిల షూటింగ్ ఆరంభంలో భారత్..అమెరికా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది. అయితే 8వ సిరీస్ నుంచి భారత్ పుంజుకుంది. 10-4గా ఉన్న స్కోర్‌ను పోటీ ముగిసేసరికి 16-4 చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. ఇక ఈ టోర్నీలో మనూ భాకర్ మొత్తం 5 (4 స్వర్ణాలు, ఒక కాంస్యం) పతకాలు సాధించగా, ఇక వ్యక్తిగత ఖాతాలో 14 ఏండ్ల నామ్య కపూర్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం 20 (9 స్వర్ణాలు, 8 రజతాలు, 3 కాంస్యాలు) పతకాలతో భారత్ అగ్రస్థానంలో నిలవగా, అమెరికా (5 స్వర్ణాలు సహా 16 పతకాలు) రెండో స్థానంతో సరిపెట్టుకుంది.